కిడ్నాప్ లేదు..గ్యాంగ్ రేప్ లేదు : చేసిదంతా డ్రామానే అంటూ చెంపలేసుకున్న యువతి!

కిడ్నాప్ లేదు..గ్యాంగ్ రేప్ లేదు : చేసిదంతా డ్రామానే అంటూ చెంపలేసుకున్న యువతి!

B Pharmacy Student Case : నిండా పాతికేళ్లు కూడా లేని అమ్మాయి… తెలంగాణ పోలీసులకు చెమటలు పట్టించింది. ఆడబిడ్డలున్న పేరెంట్స్‌ను వణికించింది. తనపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందంటూ సొసైటీనే భయపెట్టింది. నగరంలో మరో దిశ లాంటి ఘటన జరిగిందా అంటూ జనం ఆందోళన పడేలా చేసింది. మూడ్రోజుల పాటు పెద్ద సీన్‌ క్రియేట్‌ చేసింది. తీరా.. క్లైమాక్స్‌కు వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయింది. కిడ్నాప్‌ లేదు.. గ్యాంగ్‌ రేప్‌ లేదు.. అసలు ఆటోడ్రైవర్లే లేరు. అంతా కట్టు కథ. పచ్చి అబద్ధం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ టైప్‌లో స్టోరీ చెప్పిన అమ్మాయి… చివరకు ఖాకీల ఇంటరాగేషన్‌లో అడ్డంగా దొరికిపోయింది. నేను చేసిందంతా డ్రామానే అంటూ చెంపలేసుకుంది. ఏకంగా పోలీస్‌ కమిషనరే… ఆటోడ్రైవర్లకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కల్పించింది.

సంచలన విషయాలు : –
ఘట్‌కేసర్‌ భీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌, అత్యాచారం కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఘట్‌కేసర్ ఘటనంతా ఓ కట్టుకథగా తేల్చిచెప్పారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదన్నారు. యువతి కావాలనే కట్టుకథలు అల్లిందని.. పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. తొలుత యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో అలర్ట్ అయ్యామని, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాపు కేసు నమోదు చేశామని తెలిపారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా ట్రేస్‌ చేశామని, విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు వాస్తవాలు బయటపడ్డయన్నారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా : –
సీసీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు సీపీ. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని స్పష్టం చేశారు. తనపై అ‍త్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించడానికి తన దుస్తులను తానే చింపుకుందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థిని తనకు తానే ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. కిడ్పాప్‌ లేదు, రేప్‌ లేదని తేల్చారు. యువతి అందరినీ తప్పుదోవ పట్టించిందని చెప్పారు. యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన.

ఆటో డ్రైవర్ల కిడ్నాప్ : –
ఈనెల 10న సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి తిరిగొచ్చే సమయంలో… తనను ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు తల్లికి యువతి ఫోన్‌చేసి చెప్పింది. దీంతో యువతి తల్లి డయల్‌ 100కు కాల్‌ చేశారు. తన కుమార్తెను ఆటో డ్రైవర్లు కిడ్నాప్‌ చేశారని పోలీసులకు వెల్లడించారు. దీంతో సీన్‌లోకి దిగిన పోలీసులు యువతికి ఫోన్‌ చేయగా.. ఆమె తన సెల్‌ ఫోన్‌ నుంచి లోకేషన్‌ షేర్‌ చేసింది. సెల్‌ఫోన్‌ సంకేతాల ఆధారంగా అన్నోజీగూడ ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు దగ్గర బాధితురాలిని గుర్తించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

నలుగురు అత్యాచారం : –
స్పృహలోకి వచ్చిన తర్వాత యువతి తనపై కొందరు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. దీంతో నలుగురు ఆటో డ్రైవర్లను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు, బాధితురాలు చెప్పిన వివరాలకు పొంతన కుదరకపోవడంతో అనుమానంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషించారు. 10వ తేదీ సాయంత్రం యువతి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఘట్‌కేసర్‌, యంనంపేట్‌, అన్నోజీగూడ తదితర ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లు గుర్తించారు.

సెల్ ఫోన్ సంకేతాలు: –
ఆ సమయంలో పోలీసుల అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్‌ సంకేతాలు ఆ ప్రాంతాల్లో లేవనీ తేల్చారు. ఆ కోణంలో మరోసారి యువతిని ప్రశ్నించగా.. తల్లిని చీట్‌ చేయడానికే అబద్ధం చేప్పినట్లు అంగీకరించింది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోవడానికే యువతి కిడ్నాప్‌ నాటకమాడిందని తేలింది. తల్లికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆటోడ్రైవర్లపై ఉన్న కోపంతో వారు కిడ్నాప్‌ చేసినట్లు ఆస్కార్‌ అవార్డు అందుకున్న స్టోరీ లెవల్‌లో కథ క్రియేట్ చేసింది యువతి.