తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల హీట్.. ముగిసిన నామినేష‌న్ల ప‌ర్వం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల హీట్.. ముగిసిన నామినేష‌న్ల ప‌ర్వం

Nominations for MLC elections end : తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కీలకమైన నామినేష‌న్‌ల ప‌ర్వం ముగిసింది. కీలకఘట్టం ముగియడంతో పార్టీలన్ని విజయం సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నిక‌లు మ‌రింత హీట్‌ను పెంచుతున్నాయి. తెలంగాణ‌లో మ‌రోసారి ఎన్నిక‌ల వేడి రాజుకుంది. రెండు గ్రాడ్యూయేట్ ఎన్నిక‌లకు నామినేష‌న్ల ప‌ర్వం ముగియ‌డంతో.. ఇక పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

పాల‌మూర్-రంగారెడ్డి-హైద‌రాబాద్, న‌ల్గొండ‌- ఖ‌మ్మం- వ‌రంగ‌ల్ గ్రాడ్యూయేట్ ఎన్నిక‌ల్లో అభ్యర్థులు త‌మ నామినేష‌న్ లను స‌మ‌ర్పించారు. అధికార, ప్రతిప‌క్ష పార్టీల‌తో పాటు.. స్వతంత్ర్య అభ్యర్థులు సైతం బ‌రిలో నిలిచారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి 179 నామినేషన్లు వచ్చాయి.. చివరి రోజు 89 నామినేషన్లు దాఖలయ్యాయి.. ఈ రెండు స్థానాల‌కు మార్చ్ 14న పోలింగ్‌.. కౌంటింగ్ మార్చ్ 17న జ‌ర‌గ‌నుంది.

ఇక ఎన్నిక‌లు రాష్ట్రంలో అధికార, ప్రతిప‌క్షాల‌కు స‌వాల్‌గా మారాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌ త‌ర్వాత‌ వ‌చ్చిన ఈ ఎన్నిక‌లను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో బరిలోకి దిగిన వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజ‌కీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారీగా బరిలో నిలిచారు.

న‌ల్గొండ‌-ఖ‌మ్మం- వ‌రంగ‌ల్ ఎమ్మెల్సీకి సిట్టింగ్‌గా ఉన్న ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డికి మ‌రో అవ‌కాశం క‌ల్పించింది గులాబీ పార్టీ. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్, బిజేపీ నుంచి ప్రేమెంద‌ర్ రెడ్డి, టిజేఎస్ నుంచి ఫ్రోఫెస‌ర్ కొదండ‌రామ్.. తెలంగాణ ఇంటి పార్టీ నుండి చెరుకు సుధాక‌ర్ బ‌రిలో ఉన్నారు. వామ‌ప‌క్షాల త‌రపున సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ జ‌య‌సార‌థి రెడ్డి, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమా రెడ్డి, స్వతంత్ర్య అభ్యర్థిగా తీన్మార్ మ‌ల్లన్న.. అలియాస్ న‌వీన్‌లు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మ‌రికొంద‌రు ఇండిపెండెంట్ అభ్యర్తులు సైతం బ‌రిలోకి దిగారు.

ఇక హైద‌రాబాద్-రంగారెడ్డి- పాల‌మూరు అభ్యర్థిపై చివ‌రి క్షణం వ‌ర‌కు స‌స్సెన్స్ కొన‌సాగించింది టిఆర్ఎస్. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. మాజీ ప్రధాని పీవీ కూతురు సుర‌భి వాణీదేవిని రంగంలోకి దించ‌గా.. టీడీపీ నుంచి పార్టీ అధ్యక్షుడు ఎల్ ర‌మ‌ణ పోటి చేస్తున్నారు. ఇక ఇక్కడి నుండి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రాంచంద‌ర్ రావును బిజేపీ మ‌రోసారి బ‌రిలో దింపింది.

కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీ చిన్నా రెడ్డి పోటీ చేస్తుండ‌గా.. స్వతంత్ర్య అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్సీ ఫ్రోఫెస‌ర్ నాగేశ్వర్‌తో పాటు యాబైకి పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. మొన్నటి వ‌ర‌కు ఇక్కడ బిజేపీ, కాంగ్రెస్, ఫ్రొఫెస‌ర్ నాగేశ్వర్ మ‌ధ్య త్రిముఖ‌ పోటీగా క‌నిపించ‌గా.. టిఆర్ఎస్ అనూహ్యంగా వాణిదేవిని అభ్యర్థిగా నిల‌బెట్టడంతో ఒక్క సారిగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. వాణిదేవి బిజేపీ అభ్యర్థి సామాజిక వ‌ర్గం కావ‌డం.. మ‌రోవైపు ఆమె పీవీ న‌ర్సింహ్మారావు కూతురు కావ‌డం.. టీడీపీ అభ్యర్థి ఎంట్రీతో ఈ ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా కొత్త స‌మీక‌ర‌ణ‌ల‌కు తెర‌లేచే అవ‌కాశం క‌న్పిస్తోంది.

మొత్తానికి ఈరెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విక్టరీ కొట్టాలని అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రయ‌త్నిస్తుంటే.. ఇక్కడే గెలిచి ప‌ట్టు పెంచుకునేందుకు బిజేపీ, కాంగ్రెస్ త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. ఇక రాజ‌కీయంగా ప‌రువు దక్కించుకోవడానికి టిజేఎస్, వామ‌ప‌క్షాలు తాప‌త్రయప‌డుతున్నాయి. దీంతో.. ఇప్పుడు అన్నీ పార్టీల‌కు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు లైఫ్ అండ్ డెత్‌గా మారాయి. మ‌రి వీరిలో గ్రాడ్యుయేట్‌లు ఎవ‌రికి ఎమ్మెల్సీగా ప‌ట్టం క‌డ‌తారో చూడాలి.