గ్రేటర్ లో పార్కింగ్ పాలసీ : నిబంధనలు ఉల్లంఘిస్తే..రూ. 50 వేలు ఫైన్

గ్రేటర్ లో పార్కింగ్ పాలసీ : నిబంధనలు ఉల్లంఘిస్తే..రూ. 50 వేలు ఫైన్

Parking Policy : గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొత్త పార్కింగ్‌ పాలసీని అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉచిత పార్కింగ్‌ విధానం అందుబాటులో ఉన్నా కొన్ని మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, తదితర వాణిజ్య సంస్థల్లో పార్కింగ్‌ ఫీజులను వసూలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఉచిత పార్కింగ్ పాలసీ తీసుకొచ్చినా ఇప్పటికీ కొన్ని సంస్థలు అమలు చేయకపోవడంతో బల్దియా అధికారులు దృష్టి సారించారు.

ఇటీవలి కాలంలో పార్కింగ్ దోపిడిపై జీహెచ్‌ఎంసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం నిబంధనల ఉల్లంఘనులపై చర్యలకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ముందుగా మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. వాణిజ్య సంస్థలు, నిర్ణీత ఫార్మట్‌లో టికెట్లను ముద్రించకపోతే, టికెట్లపై పార్కింగ్‌ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌ లేకపోయినా.. చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.

పార్కింగ్‌ ఇన్‌ఛార్జి సంతకంతో కూడిన పార్కింగ్‌ టిక్కెట్లను వాహనాలను పార్కింగ్‌ చేసిన వారికి అందివ్వాలి. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘనలను అతిక్రమిస్తే.. ఈవీడీఎం విభాగం నుంచి నోటీసులు అందుతాయి. నోటీసులు అందిన 15 రోజుల్లోగా.. ఈవీడీఎం విభాగం తనిఖీలు చేపడుతుంది. ఉల్లంఘనలు గుర్తిస్తే వారిపై 50 వేల రూపాయల పెనాల్టీని విధిస్తుంది. మాల్స్‌తో పాటు పలు వాణిజ్య కేంద్రాల్లో మొదటి 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఏ విధమైన బిల్లు లేకుండా పార్కింగ్‌ చేసిన వారి నుంచి నిర్దేశిత పార్కింగ్‌ ఛార్జీలను వసూలు చేయనున్నారు.