Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం

స్కూల్ కి వెళ్లాలంటే రోజూ సాహసం చేయాల్సిందే. కొండలు ఎక్కుతూ దిగుతూ నదిని దాటుతూ దట్టమైన అడవిలో ఒంటరి ప్రయాణం చేస్తే కానీ ఆ స్కూల్ కి చేరుకోవడం కష్టం. కష్టమైనా, నష్టమైనా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.(Teacher Rajitha)

Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం

Teacher Rajitha (1)

Teacher Rajitha : ఆమె ప్రభుత్వ టీచర్. స్కూల్ కి వెళ్లాలంటే రోజూ సాహసం చేయాల్సిందే. కొండలు ఎక్కుతూ దిగుతూ నదిని దాటుతూ దట్టమైన అడవిలో ఒంటరి ప్రయాణం చేస్తే కానీ ఆ స్కూల్ కి చేరుకోవడం కష్టం. ఆ టీచర్ సాహసం చేయకపోతే అక్కడ వందలమంది పిల్లల భవిష్యత్తు శూన్యమైపోతుంది. అందుకే కష్టమైనా, నష్టమైనా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. వృత్తి పట్ల ఆమెకున్న నిబద్దతను చూసి అంతా శభాష్ టీచరమ్మ అని మెచ్చుకుంటున్నారు.

ఆమె పేరు రజిత. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరిమరి మండలం ఇందాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు. ఈ స్కూల్ లో 120 మంది విద్యార్థులు ఉన్నారు. టీచర్ రజిత స్కూల్ కి వెళ్లకపోతే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరమే. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపే స్తోమత తండావాసులకు లేదు. ప్రభుత్వ పాఠశాలకు టీచర్ రాకపోతే తమ పిల్లలను వారి తల్లిదండ్రులు పనులకు పంపేస్తారు. అందుకే, వారి భవిష్యత్తు పాడవకూడదనే ఉద్దేశంతో టీచర్ రజిత సాహసం చేస్తారు. కష్టమైనా, నష్టమైనా స్కూల్ కి వెళ్తున్నారు. నిత్యం సాహసం చేస్తూ సుదూర ప్రాంతం నుంచి తండాకి చేరుకుంటున్నారు.(Teacher Rajitha)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

టీచర్ రజిత ఇందాపూర్ కి చేరుకోవాలంటే ముందుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాలి. అప్పుడు సవార్ కెడ చేరుకుంటున్నారు. అక్కడి నుంచి గ్రామస్తుల సాయంతో 5 కిలోమీటర్లు బైక్ పై వెళ్తుంది. కేవలం ఈ బైక్ జర్నీ కోసమే నెలకు రూ.3వేలు ఖర్చు అవుతోంది. పోతురాజు గుడికి చేరుకున్న తర్వాత అక్కడ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ పై పడవ ప్రయాణం చేయాలి.

ఆ బ్యాక్ వాటర్ కి అవతలి ఒడ్డున ఇందాపూర్ గ్రామం ఉంటుంది. స్కూల్ వరకు చేరుకోవాలంటే మరో రెండు కిలోమీటర్లు నడవాల్సిందే. మళ్లీ ఇంటికి వెళ్లేటప్పుడు కూడా ఇంతే శ్రమ పడాలి. ఇంత సాహసం చేస్తే కానీ రోజు గడవదు. ఇదే స్కూల్ లో ఉండే మిగతా స్టాఫ్ కెరిమరి మండల కేంద్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా స్కూల్ కి చేరుకుంటారు. టీచర్ రజిత మాత్రం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటుండటంతో సాహస యాత్ర చేయాల్సి వస్తోంది.

60 ఏళ్లుగా సైకిల్ మీదే : పేదల ఇళ్లకు వెళ్లి కరోనా చికిత్స చేస్తోన్న 87 ఏళ్ల డాక్టర్

రజిత 2018 నుంచి స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు. ఈ సాహస యాత్ర వెనుక పెద్ద సంకల్పమే ఉంది. సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజన విద్యార్థులకు చదువు నేర్పించాలన్నదే ఈమె లక్ష్యం. అందుకే ఇన్ని కష్ట నష్టాలను కోర్చి పిల్లలకు చదువు చెబుతున్నానని రజిత అంటారు. స్కూల్ కి వెళ్లే మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ముందుకు కదులుతున్నారు టీచర్ రజిత. ఈమె పట్టుదల చూసి, విద్యార్థుల కోసం పడుతున్న కష్టాన్ని చూసి గ్రామస్తులు కూడా రజితకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు.

అప్పట్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో 50 నుంచి 60 మంది పిల్లలే ఉండేవారు. టీచర్ రజిత వచ్చాక ఆ సంఖ్య 120కి చేరింది. విద్యార్థులు కూడా రోజూ స్కూల్ కి వచ్చేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తమ పిల్లలకు విద్య నేర్పించేందుకు ఇంత కష్టపడుతున్న టీచర్ ను గ్రామస్తులంతా అభినందిస్తున్నారు. టీచర్ ను తమ సొంత మనిషిలా చూసుకుంటున్నారు.

గిరిజన తండాల్లో ఇలాంటి టీచర్ ఒక్కరున్నా చాలు.. వందల మంది పిల్లల జీవితాలు బాగుపడతాయి. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయి.