MLC Election Results : పట్టభద్రుల పోరు..మూడు రోజులైనా తేలని ఎమ్మెల్సీ ఫలితం.. కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్లు

హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు రోజులైనా ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 76మంది ఎలిమినేట్ అయ్యారు.

MLC Election Results : పట్టభద్రుల పోరు..మూడు రోజులైనా తేలని ఎమ్మెల్సీ ఫలితం.. కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్లు

Counting Of Second Priority Votes In Nalgonda Khammam Warangal Mlc Elections1

Telangana MLC Elections 2021 : హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు రోజులైనా ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 76మంది ఎలిమినేట్ అయ్యారు. రెండో ప్రాధాన్యతలో టీఆర్ఎస్ కు 1036, బీజేపీకి 882 ఓట్లు పడ్డాయి. నాగేశ్వర్ కు 709, కాంగ్రెస్ 465 ఓట్లు పోలయ్యాయి. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణీదేవికి లక్షా 13వేల 725 ఓట్లు వచ్చాయి. రాంచందర్ రావుకు లక్షా 05వేల 550 ఓట్లు వచ్చాయి. ప్రొ.నాగేశ్వర్ కు 54వేల 319 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 32వేల 019 ఓట్లు వచ్చాయి.

పోలింగ్‌ మొదలు కౌంటింగ్‌.. ఆపై విజేత నిర్ణయం… ఆద్యంతం సాధారణ ఎన్నికలకు భిన్నంగా, వినూత్నంగా సాగే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక ప్రక్రియ పలు ఆసక్తికర అంశాలకు వేదికగా నిలుస్తోంది. హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్‌ ప్రక్రియ బుధవారం(మార్చి 17,2021) ఉదయం మొదలైన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ విజేత తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. దీంతో నాలుగు రోజులుగా సాగుతున్న కౌంటింగ్‌ ప్రక్రియకు శనివారం ముగింపు పడుతుందా? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ ఓట్లు సాధించిన మొదటి నలుగురిని మినహాయిస్తే మిగిలిన 89 మంది సాధించిన ఓట్లు 34వేల 509. దీంతో ఈ ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఏ ఒక్కరికి గంపగుత్తగా పడినా కోటా ఓట్లను చేరుకోలేరు. దీంతో టాప్‌-4 అభ్యర్థి అయిన చిన్నారెడ్డిని కలుపుకొని 90 మందికి పడిన ఓట్లు 66వేల 063. అంటే ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 84.51 శాతం రెండో ప్రాధాన్యత ఓట్లు పడినా, లేదా బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావుకు 96.65 శాతం ఓట్లు పడితేనే కోటా ఓట్లు సాధించడం సాధ్యమవుతుంది.

ఈ క్రమంలో టాప్‌-3 అయిన స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్‌ ఎలిమినేషన్‌ ద్వారానే మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల్లో విజేతను తేల్చడం సాధ్యమవుతుందని తెలుస్తుంది. అంటే నాగేశ్వర్‌తో సహా 91 మంది అభ్యర్థులకు పడిన ఓట్లు 1,19,583. అంటే ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 46.68 శాతం రెండో ప్రాధాన్యత ఓట్లు పడితే కోటాను చేరుకుంటారు. అదే విధంగా బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు అయితే 53.39 శాతం రెండో ప్రాధాన్యత ఓట్లు సాధిస్తేనే కోటా ఓట్లను సాధిస్తారు.

విజేత తేలేది నేడే?
బరిలో 93 మంది అభ్యర్థులు ఉండటంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతోంది. శనివారం(మార్చి 20,2021) వరకు చివరి ఫలితం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి సాయంత్రంలోగా పట్టభద్రులు ఏ అభ్యర్థికి పట్టం కట్టారో తేలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ విజయానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు షిప్టుల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. 58 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌కు 387, బీజేపీకి 343 కాంగ్రెస్‌కు 174, నాగేశ్వర్‌కు 234 రెండో ప్రాధాన్యత ఓట్లు లభించాయి. మొత్తంగా వాణీదేవి 1,13,076 ఓట్లు సాధించారు. బీజీపీ అభ్యర్థి రాంచందర్‌కు 1,05,011 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో నాగేశ్వర్‌కు 53,844 ఓట్లు వచ్చాయి.