వేదాలే ఆధారంగా న‌ల్ల‌బంగారం పండిస్తున్న క‌రీంన‌గ‌ర్ యువకుడు

  • Published By: venkaiahnaidu ,Published On : September 15, 2020 / 05:11 PM IST
వేదాలే ఆధారంగా న‌ల్ల‌బంగారం పండిస్తున్న క‌రీంన‌గ‌ర్ యువకుడు

హైద‌రాబాద్‌: ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న‌ కృష్ణ బియ్యాన్ని(న‌ల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండ‌లం కాశింపేట గ్రామంలో కౌటిల్య అనే యువ‌కుడు విజయవంతంగా పండిస్తున్నారు. తిరుప‌తి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం చ‌దువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్య‌వ‌సాయంలో ప్ర‌యోగాలు చేస్తున్నారు. కృష్ణ వ్రీహి అని పిలిచే ఈ కృష్ణ బియ్యానికి ఇటీవలే జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్‌ ట్యాగ్ వచ్చింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించింది.


కృష్ణ బియ్యం ప్రత్యేకమైన ఛాయగల దేశవాళీ వరి రకం. ఇతర రకాలతో పోల్చినపుడు దీనిలో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ కృష్ణ బియ్యంలో ఉంటుంది. కృష్ణ బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఊబకాయం మొదలైన వ్యాధులు నయం కావడంలో కృష్ణ బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు రుజువైంది. కొన్ని రకాల కణుతులపై యాంటీ ఇన్‌ప్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు వెల్లడైంది. యాంథోసయనిన్ అత్యధికంగాగల ధాన్యాల్లో కృష్ణ బియ్యం ఒకటి.

కృష్ణ బియ్యంలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.


అమెరికా వ్య‌వ‌సాయ విభాగం(యూఎస్‌డీఏ) ప్రకటించిన వివరాల ప్రకారం 100 గ్రాముల కృష్ణ బియ్యంలో క్రింది పోషకాలు ఉంటాయి :

ప్రొటీన్లు – 8.8 నుంచి 12.5 గ్రాములు
లిపిడ్స్ – 3.33 గ్రాములు
ఐరన్ – 2.4 మిల్లీ గ్రాములు
అమిలోజ్ – 8.27 శాతం
కాల్షియం – 24.06 మిల్లీ గ్రాములు
మెగ్నీసియం – 58.46 మిల్లీ గ్రాములు
యాంథోసయనిన్స్ – 69 నుంచి 74 మిల్లీ గ్రాములు

అనేక తీవ్ర వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి కృష్ణ బియ్యం ఉపయోగపడతాయని రుజువైంది. అదేవిధంగా మెదడు, కాలేయం పనితీరు మెరుగుపడేందుకు దోహదపడుతుందని, బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుందని రుజువైంది. కడుపు మంట, బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుందని, మలబద్ధకాన్ని, అతిసారను నిరోధించేందుకు ఉపయోగపడుతుందని రుజువైంది.

కృష్ణ బియ్యం ఆవిర్భావం, చరిత్ర :

అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి ధార్మిక‌ ప్రాధాన్యం ఉండేది. వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారు. ప్రాచీన భారతీయులకు కృష్ణ బియ్యం లక్షణాలు, దాని ఉపయోగాలు బాగా తెలుసు. అనేక ప్రాచీన గ్రంథాల్లో కృష్ణ బియ్యం గురించి వివరించారు.


‘ఆయుర్వేద మమోదధి’లో అనేక వరి రకాలను వర్గీకరించి, వివరించారు. రక్తో భీరుక, పుండరీక (తెల్లని వరి రకం), కలమ (దళసరి బియ్యం – మే, జూన్‌లలో నాటతారు. డిసెంబరు లేదా జనవరిలో పంట చేతికి వస్తుంది). మహాపుష్పకో (పెద్ద పువ్వులతో), డిర్ఘాహ్ (పొడవైన కంకులు), కంకణ (స్వర్ణ పొట్టు) మొదలైన రకాల గురించి వివరించారు. ‘చరక సంహిత’లో కూడా ఈ పంట రకాల గురించి వర్గీకరించి వివరించారు. కృష్ణ బియ్యానికున్న‌ ఔషధ లక్షణాలను కూడా వివరించారు. కృష్ణ బియ్యాన్ని చర్మ రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించేవారనే నమ్మకం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శారీరక బలం వృద్ధికి వీటిని ఉపయోగించేవారు.


కృష్ణ బియ్యం వంటి దేశవాళీ రకాలను కాపాడటానికి వ్యవసాయ రంగం ప్రాధాన్యం ఇవ్వాలని కౌటిల్య కృ‌ష్ణ‌న్ కోరుతున్నారు. ఫంక్షనల్ ఫుడ్ మార్కెట్ల విస్తరణలో పోటీ పడే కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఈ ధాన్యాలను ఫుడ్ ఇండస్ట్రీ ఉపయోగించుకోవచ్చ‌ని, మ‌రిన్ని వివ‌రాల‌కు త‌న‌ను 86867 43452 నెంబ‌ర్ ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని కౌటిల్య సూచిస్తున్నారు. కృ‌షి భార‌తం సంస్థ‌ను నెల‌కొల్పి వ్య‌వ‌సాయరంగంలో ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ కౌటిల్య క్ర‌మం త‌ప్ప‌కుండా వృ‌ష‌భోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.