Telangana : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య వెనుక మావోయిస్టుల హస్తం ఉందా?

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యతో పోడు భూముల ఘర్షణ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నా....హక్కులు పొందలేకపోతున్నామన్న గిరిజనుల, గుత్తికోయల ఆవేదన చెందుతోంటే... పోడు భూములు పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న అటవీ సిబ్బందికి విధి నిర్వహణ ప్రాణాల మీదకు తెస్తోంది. చివరకు పోడు భూముల సమస్య అటవీశాఖ సిబ్బందికి, గిరిజనులకు మధ్య గొడవగా మారిపోయింది. ఈ క్రమంలోనే శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు. 

Telangana :  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య వెనుక మావోయిస్టుల హస్తం ఉందా?

Forest Range Officer Srinivasa Rao was murder In Telangana

Telangana : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యతో పోడు భూముల ఘర్షణ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నా….హక్కులు పొందలేకపోతున్నామన్న గిరిజనుల, గుత్తికోయల ఆవేదన చెందుతోంటే… పోడు భూములు పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న అటవీ సిబ్బందికి విధి నిర్వహణ ప్రాణాల మీదకు తెస్తోంది. చివరకు పోడు భూముల సమస్య అటవీశాఖ సిబ్బందికి, గిరిజనులకు మధ్య గొడవగా మారిపోయింది. ఈ క్రమంలోనే శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు. తెలంగాణలో దశాబ్దాలుగా అపరిష్కృతం కాని సమస్య…పోడు భూములు. అటవీశాఖ భూములన్నీ ప్రభుత్వానికి చెందుతాయన్నది ఓ వాదన. నిలువనీడలేని నిరుపేదల బతుకులకు పోడుభూములే ఆధారమని గిరిజనులంటుంటారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి…గుర్తించాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం సర్వేలు మీద సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఫలితం తేలడం లేదు.

తెలంగాణలోని అనేక జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పోడు భూముల సమస్య పరిష్కారం సవాల్‌గా మారింది. గిరిజనులు, గుత్తికోయలు సాగుచేసుకుంటున్న కొన్ని భూములు అటవీశాఖ పరిధిలోనివిగా గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మొక్కలు పెంచుతుంది. ఆ భూములను పరిరక్షిస్తోంది. అలాంటి భూముల్లో అటవీశాఖ సిబ్బంది నాటిన మొక్కలను గిరిజనులు, గుత్తికోయలు పీకివేడయం, పశువులను మేపడం, ఇది అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నించిడం…ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తడం సహజంగా జరుగుతోంది.

శ్రీనివాసరావు హత్య విషయంలోనూ ఇలాగే జరిగింది. చండ్రుగొండ మండలం బెండాలపాడులో పోడు భూముల్లో ప్రభుత్వం ప్లాంటేషన్ చేసింది. ఈ భూముల్లో గుత్తికోయలు మొక్కలును పీకివేస్తున్నారని, పశువులను మేపుతున్నారని సమాచారం అందడంతో శ్రీనివాసరావు అక్కడకు వెళ్లారు. గుత్తికోయలను ఆ ప్లాంటేషన్ భూముల నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతుండగానే ఇద్దరు గుత్తికోయలు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. బెందాలపాడులో ఉన్న గుత్తికోయలందరూ చత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చి పోడుభూముల్లో సాగుచేసుకుంటున్నవారే. ఈ భూములన్నీ అటవీశాఖ పరిధిలోకి వస్తాయని వాదిస్తున్న అధికారులు…భూమిని పరిరక్షించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గతంలో ఇలాగే గుత్తికోయలతో నిక్కచ్చిగా వ్యవహరించినందునే శ్రీనివాసరావుపై వారు పగ పెంచుకున్నారని భావిస్తున్నారు. అలాగే శ్రీనివాసరావు మావోయిస్టుల టార్గెట్‌లో ఉండడంతో హత్య వెనక వారి హస్తముందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ గుత్తికోయలకు కొందరు రాజకీయ నాయకుల అండ ఉందని, వ్యవసాయం పేరుతో ఈ భూముల్లో గంజాయి సాగు వంటి అక్రమాలు జరుగుతున్నాయని…అందుకే గుత్తికోయల హత్యకు వెనకాడలేదనీ ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరావుతో పాటు సంఘటనా స్థలంలో ఉన్న సెక్షన్ ఆఫీసర్‌ను, వాచర్ రాములను గుత్తికోయలు ఏమీ చేయలేదు. ఇది గమనిస్తే….శ్రీనివాసరావును ఆవేశంలో కాకుండా పథకం ప్రకారమే…అదను చూసి హతమార్చారన్నది పోలీసుల ప్రాథమిక అంచనా.

పోడుభూములకు పట్టాల అంశం కొన్నేళగా ఎటూ తేలడం లేదు. ఒకవేళ పట్టాలిచ్చిన తర్వాత కూడా ఈ సమస్య పరిష్కారమవుతుందన్న గ్యారంటీ లేదు. అసలెప్పుటి నుంచి సాగులో ఉన్న భూములకు హక్కుదారులను గుర్తించాలన్నదానిపైనే ఏకాభిప్రాయం కుదరడం లేదు. వైఎస్ నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2005లో పోడు భూములకు పట్టాలిచ్చారు. అప్పుడు అందరికీ ఇవి దక్కలేదు. అప్పుడు పట్టాలు పొందని వారు, తర్వాత సాగు మొదలుపెట్టినవారు కూడా ఈ పట్టాలకోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో..ఈ పట్టాలతో తమ భూములు కోల్పోతామని కూడా కొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భూముల పరిరక్షణకు ప్రభుత్వం, బతుకు తెరువు కోసం గిరిపుత్రులు చేస్తున్న పోరాటం మధ్యలో తమ పని తాము చేసే..శ్రీనివాసరావులాంటి నిజాయితీ గల అధికారులు బలైపోతున్నారు. ఈ హత్యతో అటవీశాఖ సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అడవుల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. అటవీశాఖకు మరికొన్ని ఆయుధాలు అందించడంతో పాటు…పట్టాల సమస్యను వీలయినంత త్వరగా పరిష్కరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.