మంటలు ఎగిసి పడటంతోనే శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం…

  • Published By: bheemraj ,Published On : August 21, 2020 / 07:31 PM IST
మంటలు ఎగిసి పడటంతోనే శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం…

శ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు రెస్క్యూ సిబ్బంది ఎనిమిది మృతదేహాలను వెలికితీయగా మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపింది. మృతులు డీఈ శ్రీనివాస్ (హైదరాబాద్), ఏఈలు సుందర్ (సూర్యపేట), వెంకట్ (పాల్వంచ), ఉజ్మఫాతిమా, మోహన్ కుమార్ (హైదరాబాద్), జూనియర్ ప్లాంట్ అటెండెర్ కిరణ్, బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్, మహేశ్ (హైదరాబాద్)గా గుర్తించారు.

శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్లాంట్ ను కాపాడారని జెన్కో పేర్కొంది. దట్టమైన పొగ వల్ల సిబ్బంది బయటకు రాలేకపోయారని చెప్పింది.

900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం (ఆగస్టు 20, 2020) రాత్రి 10.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ వెల్లడించింది. ప్రమాదం పసిగట్టిన ఉద్యోగులు మంటలార్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపింది.

రాత్రి 12 గంటల వరకు ఉద్యోగులు తమ ప్రయత్నాలు కొనసాగించారని, అప్పటికీ తమ వల్ల కాకపోవడంతో ప్లాంట్ లోని ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి, జరిగిన ప్రమాదంపై సమాచారం అందించారని ప్రకటనలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 17 మంది ఉద్యోగులు ప్లాంట్ లో ఉన్నారు. వీరిలో 8 మంది బయటకు రాగలిగారు. కానీ మిగిలిన 9 మంది అక్కడే చిక్కుకుపోయారు. ఎస్కేన్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి వారు ప్రయత్నించినప్పటికీ దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదని విద్యుత్ శాఖ తెలిపింది.

ప్రమాదం సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. జల విద్యుత్ కేంద్రం భూ మట్టానికి 1.2 కిలోమీటర్లు లోతులో ఉంది. అక్కడికి సొరంగ మార్గం ద్వారా మాత్రమే వెళ్లడానికి వీలవుతుంది. మంటలు, పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఉద్యోగులు చికిత్స పొందుతున్నట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది.