Chennamaneni Ramesh : మా ఎమ్మెల్యే కనబడుటలేదు….జర్మనీ నుంచే పనులు చక్కబెడుతున్నారు

Chennamaneni Ramesh : మా ఎమ్మెల్యే కనబడుటలేదు….జర్మనీ నుంచే పనులు చక్కబెడుతున్నారు

Chennamaneni Ramesh

TRS MLA chennamaneni ramesh still lives in Germany : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్.. నియోజకవర్గంలో కనబడటం లేదు. ఇప్పటికే ఏడాది దాటింది. మా ఎమ్మెల్యే ఎక్కడ అంటూ.. నియోజకవర్గ ప్రజలు నిరసనలు కూడా మొదలెట్టేశారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నించారు. తనను గెలిపించిన వేములవాడను వదిలి.. జర్మనీకి వెళ్లిపోయిన చెన్నమనేని కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది.

దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి.. మొన్నటి వేములవాడ రాజన్న శివరాత్రి వేడుకల దాకా.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌.. ప్రజలకు కనిపించకుండా పోయారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని.. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ప్రజలకు అందుబాటులో ఉండకుండా.. విదేశాల్లో ఉండటమేంటని.. ప్రతిపక్ష నేతలు, నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఎమ్మెల్యే రమేశ్ బాబు.. జర్మనీ వెళ్లి ఏడాదవుతోంది. ఇప్పటికీ తిరిగి రాలేదు. దీంతో.. నియోజకవర్గ ప్రజలంతా.. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనేమో.. జర్మనీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అందుబాటులోకి వస్తూ.. వేములవాడ వ్యవహారాలు ఆరా తీస్తూ.. అన్నీ ఆన్‌లైన్‌లోనే చక్కబెట్టేస్తున్నారు. ఇదే.. ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ.. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, ప్రజలు.. నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సమయంలో.. అసెంబ్లీని ముట్టడించేందుకు కూడా ప్రయత్నించారు. తమ ఎమ్మెల్యే ఆచూకీ తెలపాలంటూ డిమాండ్ చేశారు.

చెన్నమనేని రమేశ్.. 2009లో మొదటిసారి వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచే ఆయనపై పౌరసత్వ వివాదం రేగింది. రమేశ్ బాబు భారత చట్టాలని అతిక్రమించి.. ద్వంద పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారని.. ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రమేశ్ బాబు భారత పౌరుడు కాదని.. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని కోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. కేంద్ర హోంశాఖ కూడా కోర్టుకు ఇదే చెప్పింది. రమేష్ బాబు వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆయన ప్రయాణాలన్నీ జర్మన్ పాస్‌పోర్టుతో చేస్తున్నారంటూ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన కేసు తుది దశకు చేరుకుంది.

విదేశాల్లో ఉన్నప్పటికీ.. రమేశ్ బాబు నియోజకవర్గ సమస్యలపై ఆరా తీస్తున్నట్లు ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తల నుంచి వాదన వినిపిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. అధికారులు, పార్టీ శ్రేణులతో రమేశ్ బాబు టచ్‌లో ఉంటున్నారు. దశాబ్దకాలంగా కొనసాగుతున్న పౌరసత్వం వివాదం పక్కనబెడితే.. తాము గెలిపించిన ఎమ్మెల్యే తమకు అందుబాటులో లేకపోవడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేములవాడలో కాకుండా.. ఏడాదిగా జర్మనీలో ఉండటమేంటని.. వేములవాడ వాసులు నిలదీస్తున్నారు.