పాస్ చేస్తానని విద్యార్థినికి వల, శోభనం పేరుతో అత్యాచారం.. కీచక టీచర్‌కి పదేళ్ల జైలు శిక్ష

పాస్ చేస్తానని విద్యార్థినికి వల, శోభనం పేరుతో అత్యాచారం.. కీచక టీచర్‌కి పదేళ్ల జైలు శిక్ష

10 years jail for teacher raping student: గురువంటే దైవంతో సమానం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువే. అందుకే.. ఉపాధ్యాయుడు అన్నా, ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. కానీ, కొందరు టీచర్లు కీచకుల్లా మారుతున్నారు. పవిత్రమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు గురువులు, కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. మార్కుల పేరుతో, మాయ మాటలతో లొంగదీసుకుని అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తమ కామవాంచ తీర్చుకుంటున్నారు.

మార్కుల పేరుతో విద్యార్థినిని మచ్చిక చేసుకుని, ప్రేమిస్తున్నాంటూ నమ్మించి పెళ్లి చేసుకుని, ఆపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడో కీచక ఉపాధ్యాయుడు. ఆ కీచక టీచర్ కి వరంగల్ కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల జైలు శిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు రూ.4,500 జరిమానా వేసింది. వరంగల్‌లోని పోక్సో కోర్టు, మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కావూరి జయకుమార్‌ మంగళవారం(ఫిబ్రవరి 16,2021) ఈ తీర్పు చెప్పారు. అలాగే బాధిత బాలికకు నష్టపరిహారంగా రూ.2 లక్షలు వెంటనే అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే.. హన్మకొండ నగరం రాంనగర్‌ ప్రాంతానికి చెందిన శివసాని సాయి మణిదీప్‌ ములుగు జిల్లా వెంకటాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్‌గా పనిచేసేవాడు. అదే స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అతడు కన్నేశాడు. యూనిట్‌ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని చెప్పి విద్యార్థినికి దగ్గరయ్యాడు. 2016లో ఫైనల్ ఎగ్జామ్స్‌ తర్వాత బాలిక బుద్దారంలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మణిదీప్ ఏప్రిల్‌ 29న బాలికను కలిశాడు. మాట్లాడే పనుందని బాలికను హన్మకొండ న్యూశాయంపేటలోని తెలిసిన వారి ఇంటికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు కొత్తగూడ మండలం కుందనపల్లిలోని మరొకరి ఇంటికి తీసుకెళ్లాడు.

అక్కడి నుంచి మే 3న మరో గ్రామానికి తీసుకెళ్లి ఓ ఇంట్లో ఉంచాడు. మే 9న ఖమ్మం జిల్లా ఇల్లందు కోట మైసమ్మ దేవాలయంలో బాలికను వివాహం చేసుకున్నాడు. అదే రోజు సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి శోభనం పేరుతో ఆమెపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు బాలికతో కలిసి న్యూశాయంపేటకు చేరుకున్నాడు. అప్పటికే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మే 17న మణిదీప్ ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటు అతడికి ఆశ్రయం ఇచ్చిన దంపతులు, వివాహం చేసిన పూజారిపైనా పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో మణిదీప్‌ మినహా మిగిలిన వారిపై నేరం నిరూపణ కాకపోవడంతో కోర్టు వారిపై కేసులు కొట్టేసింది.