Kakinada Kendriya Vidyalaya Incident : కాకినాడ కేంద్రీయ విద్యాలయ ఘటనలో ట్విస్ట్..విద్యార్థుల అస్వస్థతకు చాక్లెట్లు కారణం కావొచ్చన్న ప్రిన్సిపల్
కాకినాడ కేంద్రీయ విద్యాలయలో విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వాయు కాలుష్యమే విద్యార్థుల అనారోగ్యానికి కారణమని అందరూ భావించారు. అయితే.. చిన్నారులు ఆస్పత్రి పాలు కావడానికి చాక్లెట్లు కూడా కారణం కావొచ్చనే వాదన వినిపిస్తోంది.

Kakinada Kendriya Vidyalaya incident
Kakinada Kendriya Vidyalaya incident : కాకినాడ కేంద్రీయ విద్యాలయలో విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వాయు కాలుష్యమే విద్యార్థుల అనారోగ్యానికి కారణమని అందరూ భావించారు. అయితే.. చిన్నారులు ఆస్పత్రి పాలు కావడానికి చాక్లెట్లు కూడా కారణం కావొచ్చనే వాదన వినిపిస్తోంది. పుట్టిన రోజు సందర్భంగా ఓ విద్యార్థి.. ఉదయం చాక్లెట్లు పంచాడని, అవే అనారోగ్యానికి కారణం కావొచ్చని స్కూల్ ప్రిన్సిపల్ అన్నారు.
వాయు కాలుష్యం కారణమన్న వాదనను తోసిపుచ్చిన ప్రిన్సిపల్.. ఒక వేళ అదే జరిగితే.. కేవలం రెండు క్లాసుల విద్యార్థులే ఎందుకు అనారోగ్యానికి గురవుతారని అనుమానం వ్యక్తం చేశారు. అంతకు ముందు కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడిన వాయువుల వల్లే.. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని అందరూ భావించారు. అస్వస్థతకు గురైన 30మంది విద్యార్థులకు కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స చేస్తున్నారు. వారిలో 18మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆ విద్యార్థులంతా స్పృహలో లేరని వైద్యులు తెలిపారు. మొదట విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అందరూ భావించారు. అయితే.. అందుకు ఆస్కారం లేదని స్కూల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. విద్యార్థులంతా ఎవరి ఫుడ్ వారు ఇంటి నుంచి తెచ్చుకుంటారని, అందరూ కలిసి ఒకే ఫుడ్ తినే చాన్సే లేదన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న కాకినాడ ఆర్డీవో.. హుటాహుటిన కేంద్రీయ విద్యాలయానికి చేరుకున్నారు.
చిన్నారులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై అధికారులను వివరణ కోరారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాకినాడ సమీపంలోని వలసపాక కేంద్రీయ విద్యాలయలో.. ఉదయం 9నుంచి 10గంటల మధ్య విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరి ఆడడం లేదంటూ 5, 6వ తరగతి విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెల్లో మంటగా ఉందంటూ చిన్నారులు రోదించారు.