టికెట్ బుక్ చేస్తే 3 కిలోల ఉల్లి ఫ్రీ…అబిబస్ బంపరాఫర్

  • Published By: venkaiahnaidu ,Published On : December 12, 2019 / 02:07 PM IST
టికెట్ బుక్ చేస్తే 3 కిలోల ఉల్లి ఫ్రీ…అబిబస్ బంపరాఫర్

Updated On : December 12, 2019 / 2:07 PM IST

 ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న ఉల్లి ధరల కారణంగా దేశంలోని పలు చోట్ల ఉల్లి దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఉల్లి సామాన్యుడికి ఎంత ఖరీదైనదిగా మారిపోయిందో. ఇక కిలో ఉల్లి ధర డబుల్‌ సెంచరీ దాటడంతో సోషల్‌ మీడియాలో, టిక్‌టాక్‌లలో ఫన్నీ వీడియోలు, మీమ్స్‌  వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ బస్ టికెట్ బుకింగ్ సంస్థ అబిబస్‌.కామ్‌ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌ ద్వారా గోవా ట్రిప్‌ బుక్‌ చేసుకున్న వారికి 3 కిలోల ఉల్లిని బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిని డీల్ ఆఫ్ ది ఇయర్ గా ఆ సంస్థ తెలిపింది. దీంతో పర్యాటక ప్రీయులంతా ఈ ఆఫర్‌కు ఫిదా అవుతూ గోవా పర్యటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గోవా టూర్‌కు అధిక డబ్బులు వెచ్చించిన వారికి ఆపిల్‌ ఐ ఫోన్ లేదా ఈ-బైక్‌లను గెలుచుకునే మరో ఆఫర్‌ను కూడా అబిబస్‌ ప్రకటించినప్పటకీ ఎక్కువమంది బుకింగ్‌లో ఉల్లిపాయ బహుమతినే ఎంచుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. 

దీనిపై ఆ సంస్థ సీవోవో రోహిత్ శర్మ మాట్లాడుతూ…డిసెంబర్‌ 10న ప్రకటించిన ఈ ఆఫర్‌కు మంచి స్పందన లభించిందని చెప్పారు. 54శాతం మంది  ​వినియోగదారులు గోవా పర్యటనకంటే కూడా ఉల్లిపాయాలకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి ఆశ్యర్యపోయానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో బంగారు ఆభరణాలు, విలువలైన వస్తువుల కంటే ఉల్లికే అధిక డిమాండ్‌ ఉందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. ఈ ఆఫర్‌కు వచ్చిన స్పందన చూస్తే.. తాము వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు అందిస్తున్నామన్న సంతృప్తి కలిగిందని చెప్పారు. డిసెంబర్‌ 15 వరకు ఉండే ఈ ఆఫర్‌ కోసం  అబిబస్‌ వెబ్‌సైట్‌ ద్వారా గోవా టూర్‌ బుక్‌ చేసుకోని పోటీలో నిలువవచ్చని చెప్పారు.
ఈ ఆఫర్‌ ద్వారా ప్రతి రోజు 20 మందిని విజేతలుగా ప్రకటించి.. వారికి 3 కిలోల ఉల్లిని ఇంటికి డెలివరీ చేస్తామని రోహిత్‌ తెలిపారు.