Chandrababu Remand : చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబుని విచారించారు. సుమారు 14 గంటల పాటు ప్రశ్నించారు. Chandrababu Remand

Chandrababu Remand Extends
Chandrababu Remand Extends : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుకి మరో బిగ్ షాక్. ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించింది. అక్టోబర్ 5వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరో 11 రోజుల పాటు రిమాండ్ పొడిగించినట్లు అయ్యింది. స్కిల్ స్కామ్ లో తొలుత చంద్రబాబుకి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత 2 రోజుల పాటు పొడిగించింది.
తాజాగా మరోసారి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. నిన్న(సెప్టెంబర్ 23), నేడు (సెప్టెంబర్ 24) రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్, రెండు రోజుల కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో.. సీఐడీ అధికారులు చంద్రబాబును వర్చువల్ గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అటు సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబుని విచారించారు. సుమారు 14 గంటల పాటు చంద్రబాబుని ప్రశ్నించారు.
చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 2 నిమిషాలు మాట్లాడారు. జైల్లో మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? విచారణ సమయంలో సీఐడీ అధికారులు గైడ్ లైన్స్ పాటించారా? లేదా? ఆరోగ్య పరీక్షలు చేశారా లేదా? నేను ఇచ్చిన డైరెక్షన్స్ ను సీఐడీ అధికారులు ఫాలో అయ్యారా లేదా? విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు మీపై ఏమైనా ఒత్తిడి తెచ్చారా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని న్యాయమూర్తి అడిగారు. అధికారులు గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యారని, అధికారులు నన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదని, విచారణకు నేను సహకరించాను అని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పినట్లు తెలుస్తోంది.
నా ఆరోగ్యం బాగానే ఉంది. టైమ్ టు టైమ్ నాకు టెస్టులు చేశారు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని చంద్రబాబు చెప్పారట. మీ బెయిల్ పిటిషన్ కోర్టులో ఉంది, దానిపై ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత మేము మా నిర్ణయాన్ని తెలియజేస్తాము, మీ జ్యుడీషియల్ రిమాండ్ ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నాము అని చంద్రబాబుకి తెలిపారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. మీరు చెప్పాల్సింది ఇంకా ఏమైనా ఉందా? అని న్యాయమూర్తి అడగ్గా.. ఇంకేమీ లేదని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అనంతరం అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.