వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా అలీ, వివి వినాయక్..?
నంద్యాల నుంచి సినీ నటుడు అలీ, రాజమండ్రి నుంచి దర్శకుడు వివి వినాయక్ ను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Ali, VV Vinayak to Contest for MP Seats in Andhra Pradesh
Ali, VV Vinayak: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. గెలుపు అవకాశాలే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఖరారు చేసిన 59 అభ్యర్థులతో మూడు జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు వేగంగా కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా పెండింగ్ లో ఉన్న లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే 9 ఎంపీ స్థానాలకు ఇంచార్జ్ లను ప్రకటించారు. కడప, రాజంపేట, బాపట్ల ఎంపీలను కొనసాగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ నేతలతో సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు. అనకాపల్లి నుంచి అడారి రమాదేవికి అవకాశం ఇస్తారని సమాచారం. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. నర్సాపురం అభ్యర్థిగా గోకరాజు గంగరాజు పేరు వినబడుతోంది.
కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నంద్యాల నుంచి సినీ నటుడు అలీ, రాజమండ్రి నుంచి దర్శకుడు వివి వినాయక్ ను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పద్మలత పేరు కూడా రాజమండ్రి స్థానానికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ వంగవీటి రాధా తమ పార్టీలో చేరితే ఆయనకు మచిలీపట్నం టిక్కెట్ చేయించాలని వైసీపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు.