దేశం చూపు అమరావతి వైపు.. ప్రధాని మోదీ వరాలు ఇవేనా?

ఎందుకంటే గతానికి ఇప్పటికీ కొంత పొలిటికల్ వెదర్ మారింది. కూటమిపట్ల, సీఎం చంద్రబాబు పట్ల మోదీ సానుకూలంగా ఉన్నారు.

దేశం చూపు అమరావతి వైపు.. ప్రధాని మోదీ వరాలు ఇవేనా?

Updated On : May 2, 2025 / 3:50 PM IST

ఏపీ ప్రజల కళ్లన్నీ ఇప్పుడు రాజధాని అమరావతిపైనే ఉన్నాయి. భారీ ఎత్తున మొదలవనున్న రాజధాని పనులకు ప్రధాని మోదీ వస్తుండడంతో..అందరి చూపు దాని పైనే ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన శంఖుస్ధాపన కార్యక్రమంలో కేవలం మట్టి నీళ్లే ఇచ్చి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి.

అయితే ప్రస్తుతం మారిన పరిస్ధితులు, ఎన్డీఏలో కూటమి ఆవశ్యకత నేపథ్యంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటన మరోసారి ఆసక్తిని రేపుతోంది. ఇంతకీ ప్రధాని మోదీ రాజధాని అమరావతికి ప్రకటించే వరాలు ఏంటి? రాజధాని రైతులు పెట్టుకున్న ఆశలకు మళ్లీ జీవం పోస్తారా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది. దాంతో అప్పటి టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీకి నిర్మించి ఇస్తామని అప్పటి ఎన్నికల ప్రచారంలో మోదీ హామీల వర్షం కురిపించారు. 2015 అక్టోబర్ 22న అమరావతి భూమి పూజకు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ ఏపీకి భారీ వరాలు కురిపిస్తారంటూ 5 కోట్ల ఆంధ్రులంతా టీవీలకు అతుక్కుపోయి ఆయన ప్రసంగాన్ని చెవులిక్కిరించి మరీ విన్నారు.

కానీ మోదీ మాత్రం తట్టెడు మట్టి, చెంబెడు నీళ్ళను తీసుకుని ప్రత్యేక విమానంలో వచ్చారు. వాటిని ఆయన ఏపీ పాలకులకు అందిస్తూ అమరావతి దివ్యంగా వెలిగిపోతుందని దీవించి వెళ్ళిపోయారు. ఈ మట్టి నీళ్ళను చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కేంద్రమేదో ఏపీకి భారీ సాయం చేస్తుందనుకుంటే ఈ మట్టి కథేంటి అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత మోదీపై సందర్భం దొరికిన ప్రతీసారి ఏపీకి మోదీ ఏమిచ్చారు? తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు తప్ప అంటూ విమర్శలు గుప్పించారు.

Also Read: బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ ఎవరు? ఏం జరుగుతోంది?

అలా వారూ వీరూ కాదు ఆనాడు మిత్రపక్షంగా ఉంటూ మోదీకి ఘన స్వాగతాలు పలికిన టీడీపీ 2018 నాటికి విడిపోయి ప్రత్యర్థిగా మారింది. 2018 తర్వాత సీన్ కట్ చేస్తే..ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది.. సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ అదే మోదీ…ఇప్పుడు మరోసారి రాజదాని అమరావతికి వస్తున్నారు. పనులు పునర్ ప్రారంభిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ మోడీ చేతుల మీదుగా వాటికి శ్రీకారం చుడుతోంది. మే 2న అమరావతికి వస్తున్న మోదీ ఇంకా ఏం ప్రకటిస్తారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సాగుతుంది.

ఇప్పుడు మోదీది సానుకూల ధోరణి
ఎందుకంటే కేంద్రం పెద్దన్న కాబట్టి ఈసారైనా ప్రధాని మోదీ… ఏపీమీద పూర్తిగా కరుణా కటాక్షాలు కురిపిస్తారా అని అంతా అనుకుంటున్నారు. ఈసారి మోదీ ఏపీకి భారీ వరాలే కురిపించబోతున్నారంటూ అంతటా చర్చ విన్పిస్తోంది. నిజంగా ప్రధాని మోదీ తలచుకుంటే రాజధాని కోసం కేంద్రం తరఫున ఎన్నైనా వరాలు ఇవ్వొచ్చు. ఎందుకంటే గతానికి ఇప్పటికీ కొంత పొలిటికల్ వెదర్ మారింది. కూటమిపట్ల, సీఎం చంద్రబాబు పట్ల మోదీ సానుకూలంగా ఉన్నారు.

గత ప్రభుత్వం మూడు రాజధానుల అంశంతో అమరావతి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే భవిష్యత్ లో అలాంటివి మళ్లీ జరగకుండా కేంద్రం గట్టి హామీ ఇవ్వాలని అటు రైతులతో పాటు ఇటు ఏపీ ప్రజలు గట్టిగా కోరుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా అమరావతి కోసం గట్టి పట్టుదల మీదున్నారు.

ప్రధాని కూడా ఈసారి కొన్ని వరాలతో పాటు, అమరావతి రాజధాని అంశంపై కీలక ప్రకటన చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. అయితే, ప్రధాని మోదీ కానీ కేంద్రం కానీ వరాలు ప్రకటించడం, బహిరంగంగా చెప్పడం కంటే ఏపీ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికపుడు స్పందిస్తోందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ…ప్రధాని మోదీ…మే2న ఏపీ రాజధాని అమరావతికి ఎలాంటి వరాలను ప్రకటించబోతున్నారు? రాజధానిపై ఎటువంటి కీలక ప్రకటన చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. రాజధాని పునర్ నిర్మాణం విషయంలో కేంద్రం ఎటువంటి చర్యలు చేపడుతుంది? మోదీ ఏపీకి ఏవిధంగా సాయ పడతారు?

ఇంకా ఏమైనా వరాలను ప్రకటించబోతున్నారా, ముఖ్యంగా రాజధాని అమరావతికి వేలాది ఎకరాల భూములిచ్చిన రైతులకు ఎటువంటి భరోసాను ఇవ్వబోతున్నారు? అంటూ ఐదుకోట్ల ఆంధ్రులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాజధానిలో కేంద్రం ఏమైనా కొత్త సంస్థలను స్థాపించబోతుందా? వీటిపై మోదీ ఏమైనా ప్రకటన చేస్తారా అనేది చూడాల్సి ఉంది.