త్రీ కేపిటల్స్ : 13 జిల్లాల్లో కార్యాలయాలు!

మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ కామెంట్స్‌పై తెగ చర్చ జరుగుతోంది. ఏపీలో 13 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. దీని ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తోంది. ప్రతి పనికి అమరావతికి రావడం వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని, అదే ఆయా జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడం బెటర్ అని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.
కొత్తగా రాజధాని, హైకోర్టు, ఇతర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో శివరామకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. 2014 మే 7 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించిన ఆ కమిటీ 187 పేజీల నివేదికలను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. హైదరాబాద్‌లో లాగా ఒకేచోట కాకుండా 110 ప్రభుత్వ శాఖలు రాష్ట్రంలోని వివిధ చోట్ల ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని శివరామకృష్ణ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.
రెండు జిల్లాలకు ప్రాధాన్యత తగ్గించి మిగిలిన ప్రాంతాల్లో ప్రాధాన్యత పెంచేలా రాజధాని ఫలాలను అందింవ్వాలని కమిటీ సూచించింది. శాసనసభ, సచివాలయం ఉన్నచోట హైకోర్టు ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఆ జిల్లాల్లో హర్షాతీరేకాలు వ్యక్తమౌతున్నాయి. వెనుకబడిన ప్రాంతమైన సీమ త్వరతగతిన అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటులో భాగంగా ఆ ప్రాంతంతో సమానంగా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని అందుకోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు 13 జిల్లాలకు సమానంగా ఉండేలా చూడాలని కమిటీ సూచన మేరకు నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్ ఉంది. ఆయా జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల పరిపాలన మరింత సులభతరం అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దీనిద్వారా ఇతర కంపెనీలు, పెట్టుబడులు రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచనలు చేస్తున్నారు.
* 2014 డిసెంబర్‌లో ఏపీ రాజధానిగా గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
* పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రాంత అభివృద్ధి ప్రాదికార సంస్థ (CRDA)ను ఏర్పాటు చేశారు.
* 2015 అక్టోబర్ 24వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది.
* ఏపీ రాజధాని కోసం మట్టి – నీళ్లను హస్తిన నుంచి మోడీ తీసుకొచ్చారు.
– సీఎం జగన్ చెప్పిన సౌతాఫ్రికా మోడల్ ఏంటని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దక్షిణాఫ్రికా దేశానికి మూడు రాజధానులున్నాయి. ప్రిటోరియా, కేప్‌టౌన్, బ్లోమ్‌ఫాంటేన్. ఈ మూడు నగరాలు సౌతాఫ్రికా రాజధానులు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా ఉన్న ప్రిటోరియాలో ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల కార్యాలయాలు ఉన్నాయి. లెజిస్లేచివ్ క్యాపిటల్‌గా ఉన్న కేప్‌టౌన్‌లో చట్టసభలు మాత్రమే ఉన్నాయి. ఇక జ్యుడిషియల్ క్యాపిటల్‌గా బ్లోమ్‌ఫాంటేన్‌లో ఆ దేశ సుప్రీంకోర్టు ఉంటుంది. సౌతాఫ్రికా దేశం కనుక అక్కడ సుప్రీంకోర్టు.. ఏపీ రాష్ట్రం కనుక ఇక్కడ హైకోర్టు అంతే, మిగతావన్నీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే సీఎం జగన్ ఓ క్లారిటీతో ఉన్నట్లు అసెంబ్లీలో ఆయన ప్రకటనను బట్టి అర్థమవుతోంది.
Read More :- హైకోర్టు ఏర్పాటుపై : కర్నూలులో స్వీట్లు పంచుకున్న లాయర్లు