Anam Ramanarayana Reddy: అందుకే టీడీపీ, జనసేన కలిశాయి: ఆనం రామనారాయణ రెడ్డి
ఏపీలో వైసీపీ అధికార అహంకారంతో ప్రభుత్వాన్ని నడిపిస్తోందని విమర్శించారు. కేసులు, వేధింపులతో రెచ్చిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anam Ramanarayana Reddy
Anam Ramanarayana Reddy-TDP: ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన నేతలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో మాజీ మంత్రి, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
తాము సంప్రదాయ బద్ధంగా జనసేన నేతలను కలిసి పోరాటం చేసేందుకు ముందుకు వెళ్తున్నామని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఏపీలో వైసీపీ అధికార అహంకారంతో ప్రభుత్వాన్ని నడిపిస్తోందని విమర్శించారు. కేసులు, వేధింపులతో రెచ్చిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జనసేన, టీడీపీ కలిశాయని చెప్పారు. రాజ్యాంగాన్ని సమర్థంగా నిలబెట్టేంత వరకు కలిసి పని చేస్తామని తెలిపారు.
పవన్ రియల్ హీరో..
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ… జైల్లో చంద్రబాబును కలిసి పవన్ కల్యాణ్ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అని నిరూపించుకున్నారని చెప్పారు. వైసీపీ నేతలు సోషల్ మీడియా ద్వారా జనసేన, టీడీపీ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గురువారం వామపక్షాలు, బీజేపీని కలుస్తామని తెలిపారు.
మనుక్రాంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో కలిసి పోరాడతామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తీరును ఖండిస్తున్నామని అన్నారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ విస్మరించారని తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.