MLC election Schedule : తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదే!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణలో 12 స్థానాలు, ఏపీలో 11 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Andhra Pradesh And Telangana Mlc Elections Schedule Released By Ec
MLC election Schedule : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం (నవంబర్ 9)న షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ లో 11 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 11 ఎమ్మెల్సీ స్థానాల్లో అనంతపురం 1, కృష్ణా 2, తూర్పుగోదావరి 1, గుంటూరు 2, విజయనగరం 1, విశాఖపట్నం 2, ప్రకాశం 1 స్థానానికి షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీ ఉండగా.. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు షెడ్యూల్ విడుదల అయింది. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీగా ప్రకటించింది. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.
అక్టోబర్ 31న తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. కరోనా పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణలో నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది జూన్ 3న ముగిసింది.
ఏపీలో జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో చిన్న గోవింద్ రెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీకాలం ఈ ఏడాది మే 31న ముగిసింది. దీంతో రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈనెల 16 మధ్యాహ్నం 3గం.ల వరకూ అసెంబ్లీ భవనంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఈనెల 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కించనున్నారు. వైసీపీకి శాసనసభలో పూర్తి సంఖ్యా బలం ఉన్న నేపథ్యంలో ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనంగా కనిపిస్తోంది. షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిందని సీఈవో శశాంక్ గోయల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఎన్నికల పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. కోవిడ్- 19 నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికల నిర్వహణ కొనసాగనున్నట్టు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సంఘం ఇచ్చిన కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్ కూడా అందరికి వేయాలన్నారు. మంగళవారం నుంచి మెడల్ కోడ్ అమలులో ఉంటుందని, ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఏ విధంగా ఉంటుందో అలానే ఈ ఎన్నికలకు కోడ్ ఉంటుందని సీఈఓ శశాంక్ వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని, రాజకీయ పార్టీల నేతలు, ఓటర్లు అందరూ కూడా కోవిడ్ నిబంధనలు, మెడల్ కోడ్ ను పాటించాల్సిందిగా సూచనలు చేశారు.
500 మంది కంటే ఎక్కువ మందితో సభలు సమావేశాలు పెట్టారాదన్నారు. ఎలాంటి రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు అనుమతి లేదన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలో మెడల్ కోడ్ ఉంటుందని చెప్పారు. నామినేషన్లలో ర్యాలీలు లేవని, వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అలాగే స్టార్ క్యాంపైనర్‌లు కూడా ఉండరని శశాంక్ గోయల్ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ప్రస్తుత ఓటర్ల సంఖ్య..
– ఆదిలాబాద్ 931
– వరంగల్ 1021
– నల్గొండ 1271
– మెదక్ 1015
– నిజామాబాద్ 809
– ఖమ్మం 769
– కరీంనగర్ 1323
– మహబూబ్ నగర్ 1394
– రంగారెడ్డి 1302
Read Also : Maoists posters: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు పోస్టర్ల కలకలం