‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు మీ అకౌంట్‌లో పడలేదా..? డోంట్ వర్రీ.. వెంటనే ఇలా చేయండి.. అధికారులు ఏం చెప్పారంటే..
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.

Annadata Sukhibhava
Annadata Sukhibhava Scheme: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం వీరయ్యపాలెంలో ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంకు సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేశారు.
Also Read: కొత్తగా వాహనం కొనుగోలు చేస్తున్నవారికి బిగ్ అలర్ట్.. రిజిస్ట్రేషన్ కోసం అలా చేయాల్సిన పనిలేదు..
ఆ ఖాతాల్లో డబ్బులు జమకాలేదు..
అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన వారిలో 99.98శాతం రైతు కుటుంబాల ఖాతాల్లో (44.75లక్షల మంది) నిధులు జమ అయినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న ప్రాంతాలతోపాటు ఈకేవైసీ సమస్య, ఎన్పీసీఐలో చురుగ్గా లేని, మ్యాపింగ్ కాని సుమారు లక్ష మంది రైతుల ఖాతాల్లో మాత్రం అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కాలేదని చెప్పారు. వ్యవసాయశాఖ అందించిన డేటాలో కేవలం 1,067 ఖాతాలకు మాత్రమే నగదు బదిలీ కాలేదని ఆర్టీజీఎస్ ద్వారా సమాచాంర అందించిందని చెప్పారు.
డబ్బులు రాకుంటే ఇలా చేయండి..
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. తిరస్కరణకు గురైన రైతులు ఆగస్టు 3వ తేదీ నుంచి గ్రామ రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వవచ్చునని సూచించారు. లబ్ధిదారులు ఆగస్టు 3 నుంచి అభ్యంతరాలు, సవరణలు నమోదు చేసుకోవచ్చునని, మే 2 నుంచి జులై 15 మధ్య కొత్తగా మ్యాప్ అయిన వారి నుంచి అర్జీలు తీసుకోవటం జరుగుతుందని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.
సమస్య పరిష్కరించాక వారికి నగదు..
అన్నదాత సుఖీభవ పథకంకు అర్హత కలిగిన కొందరు రైతులు ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదు. వారికి నిధులు జమ కాలేదు. ఈకేవైసీ పెండింగ్ లో ఉన్నవారు కూడా పూర్తిచేసుకుంటే వారికి పెట్టుబడి సాయం అందుతుంది. అంతేకాక.. ఎన్పీసీఐలో చురుగ్గాలేని, మ్యాప్ కాని ఖాతాలను బ్యాంకుకు వెళ్లి యాక్టివ్ చేసుకోవాలి. అప్పుడు వీరికి నగదు జమ అవుతుంది. సాగు భూమికి ఆధార్ అనుసంధానంలో తప్పులు జరిగాయి. వీటిని తహసీల్దార్లకు పంపించినప్పటికీ.. అక్కడ ఇంకా సమస్య పరిష్కారం కాకపోవటంతో కొందరి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు పడలేదు. ఇలా పలు సమస్యల కారణంగా డబ్బులు జమ కాని రైతులు ఆగస్టు 3 నుంచి సంబంధిత గ్రామ రైతు సేవా కేంద్రాల్లో, వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అర్జీలు సమర్పించి సమస్యను పరిష్కరించుకుంటే వారి ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ అవుతాయి.
పథకం అమలు ఇలా..
అన్నదాత సుఖీభవ, పీఎం కిషాన్ పథకాల కింద రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయంగా ఇస్తారు. ఇందులో కేంద్రం నుంచి పీఎం కిసాన్ ద్వారా రూ.6,000 వస్తుంది. రాష్ట్రం నుంచి రూ.14,000 వస్తాయి. ఈ మొత్తం మూడు విడతలలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడతగా రూ. 5,000, రెండవ విడతగా రూ. 5,000, మూడవ విడతగా రూ.4,000 రాష్ట్రం నుంచి ఇస్తారు. ప్రస్తుతం మొదటి విడతలో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు మొత్తం రూ.7వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి.