ఏపీ నుంచి రాజ్యసభ లక్కీ ఛాన్స్ ఎవరిది? కేంద్రమంత్రిగా అన్నామలైని తీసుకునే ఛాన్స్?
దీంతో ఏపీ నుంచి అన్నామలై పేరు రాజ్యసభకు పరిశీలించవచ్చనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.

Annamalai
రాజ్యసభకు మరోసారి పోటీచేసే ఆలోచన లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన స్థానంలో రాజ్యసభలోకి అడుగుపెట్టేది ఎవరు? బీజేపీ నుంచే అభ్యర్థి ఉంటారని ఇప్పటికే క్లారిటీ వచ్చినా.. ఆ పార్టీ నుంచి ఎవరు ఎంపీగా బరిలోకి దిగబోతున్నారన్న టాక్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారింది. రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునే ఆ అదృష్టవంతుడు ఎవరు? వాచ్ దిస్ స్టోరీ.
రాజ్యసభకు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన ఆ స్థానంలోకి ఎవరు వెళ్లబోతున్నారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం, ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో రాజ్యసభ లక్కీచాన్స్ కొట్టేసేది ఎవరికన్న చర్చ మొదలైంది.
ఏపీ బీజేపీ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టేందుకు ఒకరిద్దరు నేతలు ఉండగా, ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నేతల పేర్లే వినిపిస్తుండటంతో బీజేపీ నేతల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీ బీజేపీలో రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే ఛాన్స్ కొద్దిమందికే ఉందన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: ఈ-కార్ రేసు కేసులో తేలిందేంటి? అందుకే ఇలా జరుగుతోందా?
ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తోపాటు మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి, అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం వంటి కొద్ది మంది మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతలుగా ఉన్నారట. రాష్ట్రవ్యాప్తంగా కేడర్ ఉన్నా, వారిలో సీనియర్లుగా, ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి పదవులను చేపట్టే అనుభవం ఉన్న వారు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ విన్పిస్తోంది.
అయితే రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి సైతం అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారట. ఇదే సమయంలో త్వరలో కేంద్ర మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశం ఉన్నందున, కేంద్ర మంత్రివర్గంలో చేరే ఇతర రాష్ట్రాల నాయకులకు ఏపీ నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. 2014-19లో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుకు ఏపీ నుంచి అవకాశం కల్పించారు.
ఇప్పుడు కూడా ఓ కీలక నేతకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందంటూ టాక్ విన్పిస్తోంది. ప్రధానంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకున్న అన్నామలైని కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ నుంచి అన్నామలై పేరు రాజ్యసభకు పరిశీలించవచ్చనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.
సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిలో 29 వరకు నామినేషన్లను స్వీకరించిన తర్వాత ఈనెల 30న నామినేషన్లను పరిశీలించనున్నారు. మే 2 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువును విధించారు.
ఇక మే 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎవరు ఎంపిక అవుతారన్న దానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైందట. సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభలోకి అడుగుపెట్టే ఆ అదృష్టవంతుడు ఎవరనేది కొద్దిరోజుల్లోనే ఓ క్లారిటీ రానుంది. అప్పటివరకు ఈ సస్పెన్స్ ఇలాగే కంటిన్యూ అవుతుంది.