ఈ-కార్ రేసు కేసులో తేలిందేంటి? అందుకే ఇలా జరుగుతోందా?

ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట.

ఈ-కార్ రేసు కేసులో తేలిందేంటి? అందుకే ఇలా జరుగుతోందా?

KTR

Updated On : April 19, 2025 / 8:59 PM IST

తెలంగాణలో సంచలనం రేపిన ఈ కార్ రేస్ కేసు ఆటకెక్కినట్లేనా? రెండు సార్లు కేటీఆర్ ను విచారించిన ACB ఎందుకు సైలెంట్ అయ్యింది? ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించినంత విషయం ఏంలేదా. తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోందట. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాక తప్పదని ప్రచారం జరిగినా.. అలాంటి సంకేతాలేమి కనిపించడంలేదు. అయితే ఈ-కార్ రేస్ కేసులో పెద్దగా బలం లేకపోవడంతో ఇక ఈడీ చూసుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెలంగాణ రాజకీయల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, నిబంధనలకు విరుద్దంగా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

హైకోర్టుకు కేటీఆర్
కేటీఆర్ పేరును FIRలో నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు విచారణకు హాజరవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇదే వ్యవహారంలో ఈడీ సైతం కేసు నమోదు చేయటంతో ఈడీ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరై సమాధానాలిచ్చారు.

Also Read: 204 పరుగుల లక్ష్యాన్ని ఇలా ఛేదించిన గుజరాత్ టైటాన్స్

అయితే మరోసారి తనకు ఏసీబీ, ఈడీ నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కామెంట్స్ చేయడం ఆసక్తిరేపింది. బడ్జెట్ నుంచి అందరి దృష్టిని మరల్చేందుకు ఈ కేసులో తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

బడ్జెట్ సమావేశాలు ఎప్పుడో పూర్తయినా..ఇప్పటి వరకు కేటీఆర్ అనుమానం వ్యక్తం చేసినట్లుగా అలాంటిదేమి జరగలేదు. దీంతో రాష్ట్రంలో సంచలనం రేపిన ఈకార్ రేస్ కేసు ఏమైందంటూ పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సామాన్య జనంలోను చర్చ జరుగుతోంది. నెల రోజుల క్రితమే ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణ తుది దశకు చేరుకుందని చెప్పిన ఏసీబీ ఆధికారులు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారనే సందేహాలు తలెత్తుతున్నాయి.

అయితే గులాబీ పార్టీలో మాత్రం ఈ-కార్ రేస్ కేసుపై భిన్నమైన చర్చ జరుగుతోందట. ముందు నుంచి కేటీఆర్ చెప్తున్నట్లుగా…ఈ-కార్ రేస్ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని అంటున్నారు. నిబంధనల మేరకే ఈ కార్ రేస్ జరిగిందని,..ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని, పైగా ఈ కార్ రేస్ వల్ల ప్రభుత్వానికే ఆదాయం సమకూరిందని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు.

ప్రభుత్వం స్పందించడంలేదేంటి?
ఐతే ఏసీబీ విచారణలో కూడా ఇదే విషయం తేలిందని, అందుకే విచారణ పూర్తైనా ప్రభుత్వం స్పందించడంలేదనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోందట. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోను ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారనుకుంటే ఇలా తాత్సారం చేస్తున్నారేంటన్న చర్చ జరుగుతోందట. కానీ ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రమేయం లేదని ఏసీబీ నిర్ధారణకు రాడవంతోనే సైలెంట్ అయ్యిందన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ కేసులో ఈడీ కూడా ఎంటరైంది కాబట్టి..ఏదైనా ఉంటే ఈడీ చూసుకుంటుందిలే అని ప్రభుత్వం లైట్ తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది.

అయితే హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అందులో కేటీఆర్ ప్రమేయం ఉందని హడావుడి చేసి, కేటీఆర్ తో పాటు అధికారులను విచారించి..ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట. ఈ కేసులో ఏంలేదని, ఇదొక ఒట్టి లొట్టపీసు కేసని కేటీఆర్ చెప్పినట్లే జరిగితే రాజకీయ కక్ష్యతోనే ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతాయన్న ఆందోళన సైతం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొందట. అందుకే తొందరపడకుండా ఈ-కార్ రేస్ కేసులో ఈడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.