వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం : మంత్రి లోకేశ్
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని, న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని ..

Nara Lokesh
Nara Lokesh: అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు శుక్రవారం కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని, డీఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితిని పెంచేలా చర్యలు చేపడుతున్నామని లోకేశ్ చెప్పారు. గత ఐదేళ్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని లోకేశ్ మండిపడ్డారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తివేస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇస్తూ.. డిగ్రీ కళాశాలలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కు చాలా తేడా ఉంటుందని, గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదని లోకేశ్ అన్నారు. టీచింగ్ ను బలోపేతం చేస్తామని, ఈ ఏడాది 10 శాతం అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. నారాయణ కాలేజీ వంటి ప్రయివేట్ కాలేజీలకు ధీటుగా ఇంటర్ కాలేజీలనూ తీర్చిదిద్దుతామని చెప్పారు. 9వ తరగతి నుండి ఇంటర్ కోసం ఓరియంటేషన్ ట్రైనింగ్ చేయాలనే అంశం పై పరిశీలిస్తామని, స్కూళ్లకు ర్యాంకింగ్ మెకానిజం పెడదామని భావిస్తున్నామని లోకేశ్ అన్నారు.