23న ఏపీ కేబినెట్ భేటీ, విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం జగన్ తేల్చేస్తారా?

23న ఏపీ కేబినెట్ భేటీ, విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం జగన్ తేల్చేస్తారా?

Updated On : February 17, 2021 / 12:11 PM IST

ap cabinet meeting on february 23rd: ఏపీ కేబినెట్‌ ఈ నెల 23న(ఫిబ్రవరి) సమావేశం కానుంది. అమరావతి సచివాలయం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంత్రివర్గం సమావేశం కానుంది. 2021-22 బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలతో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో ఉగాది నాడు విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని సమాచారం. సచివాలయ కార్యాలయాలు విశాఖకు తరలివెళ్లాలంటే కనీసం రెండు నెలలన్నా కావాలన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశాలున్నాయని సమాచారం.

మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. మార్చిలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు.. సంక్షేమ పథకాలతో పాటూ కీలక అంశాలపై చర్చించనున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలని భావిస్తున్నారట. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫిబ్రవరి 19లోపు సమావేశంలో చర్చించే అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.