Amaravati: ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
2014 ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో ఇది కీలక పరిణామం. ముఖ్యంగా సెక్షన్ 5లో సవరణలు చేశారు.
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించింది కేంద్రం. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ని కేంద్ర న్యాయశాఖ విడుదల చేస్తూ ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన సవరణ చట్టం 2026కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం పొందినట్లు కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన తర్వాత బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. సోమవారం బిల్లుకు చట్టబద్ధత కల్పించారు. దీని ద్వారా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో ఇది కీలక పరిణామం. ముఖ్యంగా సెక్షన్ 5లో సవరణలు చేయడం జరిగింది. కొత్త రాజధాని అనే చోట అమరావతి రాజధానిగా పేర్కొనాలంటూ ఈ గెజిట్ లో స్పష్టం చేయడం జరిగింది.
అమరావతిని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్రం ప్రకటించింది. అమరావతి పరిధిలోని రాజధాని ప్రాంతం అంటే సీఆర్డీఏ చట్ట ప్రకారంగా ఉంటుందని గెజిట్ లో పేర్కొన్నారు. ఈ చట్టం 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ఈ గెజిట్ లో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టతనిచ్చే ఈ కీలకమైన గెజిట్ కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి కూడా ఏపీ అధికారిక రాజధానిగా అమరావతి పిలవబడబోతుంది.
Also Read: జగన్ సన్నిహితుడికి కూటమి ప్రభుత్వం బిగ్ షాక్..! ఆ స్కామ్లో అరెస్ట్ తప్పదా?
