Chandrababu Naidu: 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామని.. పదవులు ఇవ్వాలని అనడం సరికాదు: చంద్రబాబు
పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్టం చేశారు.

N Chandrababu Naidu
అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందని, పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని హెచ్చరించారు.
ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామని పదవులు ఇమ్మనటం సరికాదని చంద్రబాబు నాయుడు తెలిపారు. కష్టపడందే ఏదీ రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలమైపోయామనో, పదవులు వచ్చేశాయనో పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు.
పార్టీ వల్లే మంత్రైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులని గ్రహించి ప్రవర్తించాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్టం చేశారు. తాను ఈ సారి పార్టీకి సమయం కేటాయిస్తున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు.