వైఎస్ జగన్ ‘పుష్ప2’ సినిమా డైలాగ్‌పై ఘాటుగా స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

సినిమా డైలాగులను ఫ్లెక్సీల్లో పెట్టారని జగన్ అనడం దిగజారుడుతనానికి నిదర్శనమంటూ..

వైఎస్ జగన్ ‘పుష్ప2’ సినిమా డైలాగ్‌పై ఘాటుగా స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

Updated On : June 19, 2025 / 6:41 PM IST

పుష్ప సినిమా డైలాగులు, సీన్లు, మేనరిజం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు? అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మీడియా సమావేశంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇవాళ అమరావతిలో చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీనిపై స్పందించారు.

“జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోతే.. ఇప్పుడు పరామర్శకు వెళ్తారా? పర్యటనలో మీ వాహనంతో ఢీ కొట్టి చంపేశారు. వారివి ప్రాణాలు కాదా? పోలీసులు ఏమీ చేయకపోయినా జగన్ దబాయిస్తూ, దౌర్జన్యం చేస్తున్నారు. సినిమా డైలాగులను ఫ్లెక్సీల్లో పెట్టారని జగన్ అనడం దిగజారుడుతనానికి నిదర్శనం. బాబాయ్‌ను లేపేసినా తప్పులేదు అంటే ఎలా? జగన్ మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది” అని చంద్రబాబు అన్నారు.

Also Read: వైఎస్ జగన్ నోట ‘పుష్ప2’ సినిమా డైలాగ్.. ‘రప్పా..రప్పా’ అంటూ..

“కొంత మంది రాష్ట్రంలో ప్రశాంతత చెడగొట్టేందుకు యత్నిస్తున్నారు. విచిత్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్. ఇలా చంపేయండి.. నరికేయండి అని మాట్లాడుతూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రభుత్వం జగన్‌కు అనుమతి ఇచ్చింది. జగన్‌ను వంద మందితో వెళ్లాలని మాత్రమే పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాజకీయ నేతలు హుందాగా వ్యవహరించాలి. రెచ్చగొట్టేలా, గొడవలు సృష్టించేలా జగన్ వ్యవహరించడం సరైంది కాదు.

ఇప్పుడు కొత్త బ్యాచ్ వచ్చి కొత్త విధానాలు అమలు చేస్తోంది. గంజాయి, బెట్టింగ్, రౌడీలు, బెట్టింగ్, అత్యాచారాలు చేసే వారికి విగ్రహాలు పెడుతున్నారు. బెట్టింగ్ చేయడం తప్పు.. గంజాయికి వ్యసనం అయిన వారిని ఎవరైనా ప్రోత్సహిస్తారా? సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నివారించకుండా ఇష్టానుసారంగా సపోర్టు చేస్తారా?

జగన్ లాంటి వాళ్లు ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో తెలియడం లేదు. రౌడీయిజం చేసే మార్గాన్ని జగన్ చూపిస్తున్నారు. పొదిలిలో 40 వేల మందితో జన సమీకరణ ఎందుకు చేశారో చెప్పాలి. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకే 40 వేల మందితో జన సమీకరణ చేశారు.

గత ప్రభుత్వంలో అరాచకాలు ఎన్నో జరిగాయి. జరిగిన వాటికి చర్యలు తీసుకోకూడదంటే ఎలా? అవినీతి, అక్రమాలు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే ఎలా? తప్పుడు పనులు చేసి ఇప్పుడు ఏమీ చేయలేదని వెనకేసుకొస్తే ఎలా? వైసీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా ఎవరూ ఏమీ చేయడం లేదు. తప్పు చేసిన వారిపై అంతా చట్ట ప్రకారంగానే విచారణ జరుగుతోంది.

నాకు ఒట్లు వేశారు కాబట్టే ఇలాంటి వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నా. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే జగన్ తరహాలో వ్యవహరిస్తూ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి చర్యలను వ్యతిరేకించాలి. మా మేనిఫెస్టో హామీల అమలుపై ప్రజలు అడిగితే నేను సమాధానం చెబుతా… రాజకీయం చేస్తే తాట తీస్తా” అని చెప్పారు.