YS Jagan: వైఎస్ జగన్ నోట ‘పుష్ప2’ సినిమా డైలాగ్.. ‘రప్పా..రప్పా’ అంటూ..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పారు.

ys jagan: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో తన పర్యటన సమయంలో ఆంక్షలు విధించడం పట్ల జగన్ తప్పుబట్టారు. చనిపోయిన మా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం తప్పా.. ఎందుకు నా పర్యటనకు ఆంక్షలు పెట్టారు అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో జగన్.. పుష్ప-2 సినిమాలో బాగా ఫేమస్ అయిన రప్పా.. రప్పా డైలాగ్ చెప్పారు.
జగన్ పల్నాడు జిల్లా పర్యటన సమయంలో ఓ ప్లకార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో.. జగన్ ఫొటో పెట్టి.. ‘‘2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం ఒక్కొక్కడిని’’ అంటూ రాశారు. మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు ఆ ప్లకార్డు విషయంపై జగన్ ను ప్రశ్నించారు. దీంతో గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం.. అని వైఎస్ జగన్ ఆ డైలాగ్ చెప్పారు. ఆ తరువాత జగన్ మాట్లాడుతూ.. పుష్ప2 సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు..? మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా..? అంటూ జగన్ ప్రశ్నించారు.
ఇదే సమయంలో ఓ మీడియా ప్రతినిధి ఆ ప్లకార్డు ప్రదర్శించింది టీడీపీకి చెందిన వ్యక్తి.. ఆయనకు టీడీపీ సభ్యత్వం కూడా ఉందంటూ జగన్‌కు చూపించగా.. టీడీపీ అనుకూల వ్యక్తి కూడా చంద్రబాబుపై కోపంతో మారాడని సంతోషపడదాం.. మారి.. టీడీపీనే రప్పా రప్పా కోసేస్తానని అంటున్నాడని సంతోషపడదాం అంటూ జగన్ వ్యాఖ్యానించారు.