ఏపీలో కరోనా..పోటాపోటి పడుతున్న గుంటూరు, కర్నూలు

  • Published By: madhu ,Published On : April 18, 2020 / 02:24 AM IST
ఏపీలో కరోనా..పోటాపోటి పడుతున్న గుంటూరు, కర్నూలు

Updated On : April 18, 2020 / 2:24 AM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  నిన్న ఒక్కరోజే కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర  వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 572కు చేరింది.  రాష్ట్రంలో కరోనాతో  14 మంది చనిపోగా… 35 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 523 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 5, గుంటూరు  జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 5, కడప జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి.  

గుంటూరు, కర్నూలు జిల్లాలు కోవిడ్‌ కేసుల నమోదులో పోటీ పడుతున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా కేసులు ఈ రెండు జిల్లాల్లో పుట్టుకొస్తున్నాయి. దీంతో కేసుల నమోదులో ఈ రెండు జిల్లాలు ఇప్పటి వరకు సమానంగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు గుంటూరులో కేసులు ఎక్కువ ఉండగా… ఇప్పుడు కర్నూలు గుంటూరుతో సమానంగా కేసులు పెంచుకుంది. రెండు జిల్లాల్లోనూ 126క కేసుల చొప్పున నమోదయ్యాయి. 

గుంటూరు జిల్లాలో వైద్య విద్యార్థినికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో 12 మంది  ఆస్పత్రి వైద్యులను క్వారంటైన్‌కు తరలించారు. జిల్లాలో ఇంకా 1500 మంది రిజల్ట్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు.  జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో కరోనా బాధితులు పెరుగుతుండడంతో ఏపీ సీఎం జగన్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  కుటుంబ సర్వేలో దగ్గు, జలుబు, జ్వరం, ఇతరత్రా లక్షణాలను గుర్తించిన వారందరికీ కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పేషెంట్ల కేర్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన చర్యల గురించి ఆరా తీశారు. 40 ఏళ్లకు పైబడి, ఏవైనా వ్యాధులతో బాధ పడుతున్న వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.  జిల్లాల్లో గుర్తించిన కోవిడ్‌ ఆసుపత్రులు కాకుండా మిగతా ఆసుపత్రుల్లో రెగ్యులర్, ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలను మరింత మెరుగు పర్చాలని ఆదేశించారు.

Also Read | తెలంగాణాలో కరోనా : ఆ నాలుగు జిల్లాల్లో కేసులు అత్యధికం