సంధ్యా థియేటర్‌లో తొక్కిసలాట ఘటన.. మౌనం వీడిన పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్‌ని మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని కామెంట్స్
అల్లు అర్జున్ తరఫున ఎవరైనా ముందే వెళ్లి రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదని అన్నారు.

Pawan Kalyan
AP Deputy CM Pawan Kalyan: సంధ్యా థియేటర్‌లో తొక్కిసలాట జరగడం, హీరో అల్లు అర్జున్‌పై కేసు పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మౌనం వీడారు. దీనిపై మొదటిసారి స్పందించారు. అల్లు అర్జున్‌ని మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని పవన్ అన్నారు. అల్లు అర్జున్ తరఫున ఎవరైనా ముందే వెళ్లి రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదని అన్నారు.
సోమవారం పవన్ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. అల్లు అర్జున్ వ్యవహారం.. గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని కొనియాడిన పవన్.. వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదని అన్నారు. బెనిఫిట్ షోలు, అధిక ధరలు ఉన్నప్పుడు కలెక్షన్లు రికార్డు స్థాయిలో వస్తాయని, సలార్, పుష్పా సినిమాలకు అందుకే రికార్డ్ కలెక్షన్లు వచ్చాయని పవన్ పేర్కొన్నారు.
“అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. సినిమా థియేటర్లకు హీరోలు వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయి. నేను మొదట్లో మూడు సినిమాలకు వెళ్లి పరిస్థితి అర్థం చేసుకొని ఆగిపోయాను. అల్లు అర్జున్ కూడా ఆగిపోయి ఉండాల్సింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సాప్ట్ గా వెళ్లి ఉంటే బాగుండేదని పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ చనిపోవడం బాధాకరం. ఘటన జరగ్గానే సినిమా హీరో లేదా నిర్మాతలు, దర్శకుడు వాళ్ల ఇంటికి వెళ్లి సపోర్టు ఇవ్వాల్సింది. మీ బాధలో మేమున్నాము అని భరోసా ఇవ్వాల్సింది” అని పవన్ పేర్కొన్నారు.
యూనిట్ మొత్తం మద్దతు ఇవ్వాల్సింది..
అల్లు అర్జున్ వెళ్లడం కుదరకపోయినా మిగిలిన వాళ్లు వెళ్లి ఉండాల్సిందని పవన్ అన్నారు. “అలా వెళ్లపోవడం పొగరు అనుకుంటారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి మద్దతుగా ఉండాలి. ప్రత్యక్షంగా కారణం కాకపోయినా యూనిట్ మొత్తం మద్దతు ఇవ్వాల్సింది. అలా చేయకుండా సమస్య మొత్తం హీరో మీద వేసేశారు. సినిమా అనేది టీమ్. కానీ, ఈ ఘటనలో హీరోని ఒంటరిని చేశార”ని పవన్ పేర్కొన్నారు.
“తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా రంగాన్ని బాగానే ప్రోత్సహించారు. బెనిఫిట్ షో అధిక ధరలకు అనుమతి ఇచ్చారు కదా.. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ వ్యవహారంలో అలా చేశారని అనుకోవడం లేదని పవన్ అన్నారు. రేవంత్ రెడ్డి అలాంటి వాటినన్నింటినీ మించిన నాయకుడు.. ఆయన నాకు చాలాకాలంగా తెలుసు. వన్స్ కేసు నమోదు అయ్యాక చట్టం ప్రకారం జరిగిపోయింది. రేవంత్ రెడ్డిని తప్పుబట్టలేము.. ఆ స్థానంలో ఎవరున్నా చట్ట ప్రకారం ఫాలో అవుతారు. లాలూచీ పడితే మీడియా, ప్రజలు తిట్టరా? అది పెద్ద సమస్య అవుతుంద”ని పవన్ అన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి చెందిన గోదాంలో బియ్యం మిస్సింగ్ పై కేసు నమోదు కావడంపై మీడియా ప్రతినిధులు పవన్ కల్యాణ్ ను ప్రశ్నించగా.. “తప్పు జరిగింది కాబట్టే కేసు పెట్టారు. డబ్బులు కట్టేశాం అంటే ఎలా.. తప్పు జరిగింది కదా. ఆడవాళ్లా మగవాళ్లా అనేది ఉండదు కదా చట్టంలో. భార్యపై కేసు వద్దు.. బాధ్యత నాది అని పేర్ని నాని అంటే అప్పుడు ఆయనపై కేసు ఉంటుందేమో”నని పవన్ పేర్కొన్నారు.