ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఆగని ఉద్రిక్తతలు.. కడప జిల్లాలో నేతలకు భద్రత పెంపు, తాడిపత్రిలో హైటెన్షన్
Jammalamadugu: వైసీపీ, కూటమి నాయకుల మధ్య తోపులాట, రాళ్లదాడి జరిగింది. ఇవాళ మళ్లీ కవ్వింపు చర్యలకు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినప్పటికీ పలు ప్రాంతాల్లో ఘర్షణలు ఆగడం లేదు. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలకు భద్రత పెంచారు. సోమవారం జరిగిన ఘటనతో జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కారణంతోనే బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డితో పాటు కడప ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి 2+2 గన్ మ్యాన్లతో భద్రత పెంచారు.
జమ్మలమడుగులో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జమ్మలమడుగులో సోమవారం వెంకటేశ్వర కాలనీ లోని 116 పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, కూటమి నాయకుల మధ్య తోపులాట, రాళ్లదాడి జరిగింది. ఇవాళ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చని అనుమానాలు నెలకొన్నాయి. అది నారాయణ రెడ్డి, భూపేశ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. జమ్మలమడుగు టీడీపీ కార్యాలయం వద్దకు కూటమి కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
కొత్త గణేశుని పాడులో ఘర్షణ
పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం కొత్త గణేశుని పాడులో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలు వాహనాలు, బైక్ లు ధ్వంసమయ్యాయి. రాత్రి ఇళ్లపై దాడి జరగడంతో స్థానికులు భయాందోళనల్లో ఉన్నారు. మహిళలు గుడిలో తలదాచుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.
తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
టీడీపీ, వైసీపీ వర్గాల రాళ్ల దాడితో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరుడిపై జేసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో జేసీ ముఖ్య అనుచరుడు టీడీపీ సీనియర్ నేత సూర్యముని ఇంటిపై దాడికి పెద్దారెడ్డి వర్గీయులు యత్నించారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో రూరల్ సిఐ మురళీకృష్ణ తలకు గాయమైంది. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన చేపట్టారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు దూసుకుపోతున్న ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులను అడ్డుకోవడానికి పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. తమ నేతలపై దాడుల సందర్భంగా పోలీసుల వైఫల్యంపై జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిని పెద్దారెడ్డి అనుచరులు ముట్టడించి రాళ్ల వర్షం కురిపించారు. రాళ్ల దాడిలో అడిషనల్ యస్పీ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
తిరుపతిలో పులివర్తి నానిపై దాడి
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని దాడికి గురయ్యారు. తిరుపతి నగరంలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వైసీపీ నేత భాను, అతడి అనుచరులు దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మ రక్షణ కోసం పులివర్తి నాని గన్‌మెన్ గాలిలోకి కాల్పులు జరిపాడు. దాడి జరిగిన రోడ్డుపైనే బైఠాయించి పులివర్తి నాని నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. రెండు వాహనాలు ధ్వంసం చేసి, ఒక బుల్లెట్ వాహనాన్ని తగలబెట్టారు. పోలీసులు లాఠిచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు మీడియా ప్రతినిధులకు కూడా లాఠీ దెబ్బలు తగిలాయి. కాగా, పులివర్తి నానిపై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు.
Also Read: అందుకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను: మంత్రి అంబటి రాంబాబు