Free Power: ఏపీలో ఉచిత కరెంట్‌కు ప్రభుత్వం పచ్చజెండా.. ఎవరెవరికంటే..
విశాఖలో 5 ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నాం. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు నిర్మిస్తున్నాం.
Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)
- ఈ స్కీమ్ తో చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఆర్థిక ఊరట
- మగ్గానికి 200 యూనిట్లు, మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్
- 50ఏళ్లకే నేతన్నలకు రూ.4వేల పెన్షన్
Free Power: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత విద్యుత్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనుంది. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.85 కోట్ల మేర భారం పడనుంది. మగ్గానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నారు. దీని వల్ల 93వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మర మగ్గానికి 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తారు. దీని వల్ల 10,534 కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ఈ స్కీమ్ తో చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఆర్థిక ఊరట కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు.
ఉచిత విద్యుత్ తో మగ్గానికి 200 యూనిట్లకు నెలకు సుమారుగా రూ.720, ఏడాదికి రూ.8,640 ఆదా అవుతాయన్నారు. మర మగ్గం లబ్దిదారులకు నెలకు రూ.1800.. ఏడాదికి రూ.21,600 ఆదా అవుతాయి. ఇక 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్లు మంజూరు చేయనున్నారు. 87,280 మంది నేతన్నలకు పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. రూ..3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్లు పెంచడం వల్ల నేతన్నకు నెలకు రూ.1000 చొప్పున్న ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక లబ్ధి కలుగుతోందన్నారు.
చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడమే లక్ష్యం..
”చేనేత రంగ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు రూ.7 కోట్ల బకాయిల చెల్లింపు. రూ.1.67 కోట్ల ఈ ఏడాది మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ నిధులిచ్చాం. NHDC ద్వారా నూలుపై 15 శాతం రాయితీ ఇస్తున్నాం. నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచాం. ఆప్కోలో రెడీ మేడ్ దుస్తుల అమ్మకాలతో నేతన్నలకు ఉపాధి పెరిగింది. చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కో ఆప్టెక్స్, టాటా తనేరియా, బిర్లా ఆద్యం సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ కామర్స్ ద్వారా చేనేత వస్త్రాల డోర్ డెలివరీ.
విశాఖలో 5 ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నాం. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు నిర్మిస్తున్నాం. మంగళగిరిలో మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మిస్తున్నాం. ధర్మవరంలో రూ.30 కోట్లతో మెగా క్లస్టర్ నిర్మిస్తున్నాం. పిఠాపురంలో మెగా క్లస్టర్ నిర్మించబోతున్నాం. రాష్ట్రంలో రూ.10.44 కోట్లతో 10 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. ODOP అవార్డులో ఏపీకి 9 అవార్డులు వస్తే.. వాటిలో చేనేత ఉత్పత్తులకు 4 అవార్డులు వచ్చాయి. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో ఒక బంగారు పతకం లభించింది” అని మంత్రి సవిత తెలిపారు.
