ఏపీలో కరోనా బాధితులకు రూ.2వేల సాయం నిలిపివేత, కారణం ఏంటంటే..

ఏపీలో కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలలో ఉండి కోలుకున్న నిరుపేద బాధితులకు ప్రభుత్వం ‘ఆసరా’ కింద రూ..2వేలు ఆర్థిక సాయం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయిదే ఇప్పుడా ఆర్థిక సాయం నిలిచిపోయింది. జులై నుంచి పలుచోట్ల కరోనా బాధితులకు ఈ సాయం అందడం లేదని సమాచారం. ప్రభుత్వమే ఈ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. పాజిటివ్ కేసుల వృద్ధితో ఆర్థికభారం పెరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఈ సాయాన్ని నిలిపేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
పౌష్ఠికాహారం కోసం ప్రతి ఒక్కరికి రూ.2వేల సాయం:
కరోనా వైరస్ సోకినవారు ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లిన తర్వాత పౌష్ఠికాహారం తీసుకొనేందుకు వీలుగా ప్రతి ఒక్కరికి రూ.2వేల ఆర్ధికసాయం అందజేస్తామని ముఖ్యమంత్రి సీఎం జగన్ ఏప్రిల్ నెలాఖరులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు మే 4న వైద్యారోగ్య శాఖకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ చెల్లింపులు చేపట్టారు. కరోనా నుంచి కోలుకున్న చాలామందికి ఈ సాయం అందింది.