AP Government : ఏపీలో విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన కూటమి సర్కార్.. రూ. 400 కోట్లు విడుదల
AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తూ రూ.400 కోట్లు విడుదల చేసింది.

AP Government
AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో విద్యార్థులకు ఉపశమనం కల్పించింది. రూ.400 కోట్లు విడుదల చేస్తూ శనివారం వేరువేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2023 -24, 2024 – 25 విద్యా సంవత్సరాల్లో ఉన్నత విద్య కోర్సుల ఫైనలియర్ పూర్తిచేసి బయటకు వచ్చిన విద్యార్థుల ఫీజు బకాయిల కోసం ప్రభుత్వం రూ.400 కోట్లు విడుదల చేసింది. 2024-24 విద్యా సంవత్సరం ఫీజులను కాలేజీల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే, 2023-24 విద్యా సంవత్సరం వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఆ విద్యాసంవత్సరం ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో కాకుండా.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. ఆ సమయంలో విద్యార్థుల తల్లులు ఆ మొత్తాన్ని కాలేజీకి చెల్లించేవారు. ఆపై విద్యార్థి, వారి తల్లిపేరుమీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫీజురీయింబర్స్ మెంట్ ను ఆ ఖాతాల్లో జమ చేసేవారు.
ఆ విధానం ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్ మెంట్ ను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయాల్సి ఉంటుంది. అయితే, ఫీజులు కట్టకపోయినా తాము సర్టిఫికెట్లు ఇచ్చామని, అందువల్ల ఆ ఫీజులు తమకే ఇవ్వాలని కొన్ని కాలేజీలు కోరాయి. ప్రభుత్వం దీనిపై సర్వే చేయగా.. చాలావరకు కాలేజీలు ఇప్పటికే ఫీజులు వసూలు చేసినట్లు తేలింది. దీంతో ఆ విద్యా సంవత్సరం ఫీజులను తల్లుల ఖాతాల్లోనే జమ చేసే అవకాశం ఉంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లింపు విధానంలో మార్పులు చేసింది. గతంలోలా విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను నేరుగా కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లోనే జమ చేసేలా మార్పు చేసింది. దీంతో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నగదును ప్రభుత్వం నేరుగా కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయనుంది.