ఏపీ రైతులకు భారీ గుడ్‌న్యూస్.. మీ బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు పడేది ఆరోజే.. క్లారిటీ వచ్చేసింది..
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా కొంతైనా భరోసాను అందించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని..

Annadata Sukhibhav scheme
Annadata Sukhibhava: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా కొంతైనా భరోసాను అందించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని పున:ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి మూడు విడతల్లో డబ్బులు జమ చేయనుంది. అయితే, తొలి విడత నగదు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఆలస్యమవుతోంది. తాజాగా.. ఈ పథకం నిధుల విడుదలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రతీయేటా రూ.6వేలను మూడు విడతల్లో జమ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నుంచి రూ.14వేలు కలిపి మొత్తం రూ.20వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. అయితే, తొలి విడతలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నగదు రూ.2వేలు, అన్నదాత సుఖీభవ పథకం రూ.5వేలు.. మొత్తం రూ.7వేలు రైతుల అకౌంట్లలో జమ కావాల్సి ఉంది.
అన్నదాత సుఖీభవ పథకం నిధులకోసం ఎదురు చూస్తున్న రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. ఆగస్టు తొలివారంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు.
పీఎం కిసాన్ సమ్మాన్ పథకం నిధులతోపాటు అన్నదాత సుఖీభవ పథకం నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధం చేసింది. ఆగస్టు 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి పర్యటన ఉండగా.. ఆరోజు జరిగే బహిరంగ సభలో ఈ నిధులను విడుదల చేయనున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. దీంతో అదేరోజు అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధులను రైతుల అకౌంట్లలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.