AP Govt: ఏపీలో నేతన్నలకు మరో గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల
2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు పైగా నేతన్నలకు అందజేశామని మంత్రి వివరించారు. చేనేత రంగ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.
Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)
- 2025-26కు సంబంధించి మొదటి విడత నిధుల విడుదల
- 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ
- 5వేల 726 నేతన్నలకు లబ్ధి
AP Govt: ఏపీలో నేతన్నలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేసింది. 2025-26కు సంబంధించి మొదటి విడత నిధుల విడుదలయ్యాయి. 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేశారు. దీని ద్వారా 5వేల 726 నేతన్నలకు లబ్ధి కలిగిందని మంత్రి సవిత తెలిపారు.
సంక్రాంతి పండక్కి ముందు రూ.5 కోట్ల ఆప్కో బకాయిలను చెల్లించామని మంత్రి సవిత వెల్లడించారు. డిసెంబర్ లో రూ.2.42 కోట్ల బకాయిలను చెల్లించామన్నారు. 2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు పైగా నేతన్నలకు అందజేశామని మంత్రి వివరించారు. చేనేత రంగ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. త్రిఫ్ట్ ఫండ్ నిధుల విడుదలపై కూటమి ప్రభుత్వానికి, మంత్రి సవితకు చేనేత సహకార సంఘ ప్రతినిధులు, నేతన్నలు ధన్యవాదాలు తెలిపారు.
చేనేత కార్మికుల కోసం గత టీడీపీ ప్రభుత్వం హయాంలో త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ స్కీమ్ ని రద్దు చేసింది. నేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభత్వం ఈ పథకాన్ని మళ్లీ తెచ్చింది. త్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ పునరుద్ధరణతో చేనేత కార్మికులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం అమలు కోసం 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.
చేనేత కార్మికులకు ఆర్థికంగా మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని తెచ్చింది ప్రభుత్వం. చేనేత సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న చేనేత కార్మికులే దీనికి అర్హులు. ఈ పథకం కింద చేనేత సహకార సంఘాల్లో సభ్యుడిగా ఉన్న కార్మికుడు తన నెలవారీ సంపాదనలో 8 శాతాన్ని పొదుపు చేస్తే.. ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్ నుంచి 16 శాతాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. మూడు నెలలకు ఒకసారి చొప్పున చేనేత కార్మికుల ఖాతాల్లోకి ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుంది.
