AP Curfew Timings : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు… నేటి నుంచి కొత్త టైమింగ్స్

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూలో సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఏపీలోనూ కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.

AP Curfew Timings : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు… నేటి నుంచి కొత్త టైమింగ్స్

Ap Curfew Timings

Updated On : June 11, 2021 / 11:07 AM IST

AP Curfew Timings : కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూలో సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఏపీలోనూ కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. మరిన్ని సడలింపులు ఇచ్చింది. సడలింపు సమయాన్ని మరో రెండు గంటలు పెంచింది. దీంతో నేటి(జూన్ 11,2021) నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. అదే సమయంలో కర్ఫ్యూని పొడిగించింది ప్రభుత్వం. మరో పది రోజులు అంటే జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అలాగే ఈ సడలింపులు కూడా అమలవుతాయని ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటివరకూ ప్రతిరోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే కర్ఫ్యూలో మినహాయింపు ఉండేది. ఈ సమయంలోనే ప్రజలు తమ నిత్యావసర పనులు చేసుకునే వారు. ఇప్పుడా సడలింపు సమయం మరో రెండు గంటలు పెరిగింది. కాగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకూ కఠినమైన కర్ఫ్యూ అమలు కానుంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

కర్ఫ్యూ వేళల్లో సడలింపులతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉ. 8 గంటల నుంచి మ.2 గంటల వరకు పని చేయనున్నాయి. బ్యాంకుల పని వేళలూ మారాయి. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తాయి.

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 97వేల 863 శాంపిల్స్‌ పరీక్షించగా.. 8వేల 110 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. యాక్టివ్ కేసులు సైతం లక్షలోపే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 17,87,883 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 12,981 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడటంతో.. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 16,77,063కి చేరింది. కరోనాతో మరో 67మంది మృతి చెందారు. కాగా, కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం దరి చేరనివ్వొద్దని సీఎం జగన్ సూచించారు. గతంలోలానే కఠినంగా కర్ష్యూ అమలు చేయాలని, అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.