Movie Tickets Sale : ఏపీలో ప్రభుత్వం ద్వారానే సినిమా టికెట్ల అమ్మకాలు.. కీలక జీవో జారీ
సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెం.142 జారీ చేసింది.

Movie Tickets
Movie Tickets Sale : సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెం.142 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఆన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయి. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాల బాధ్యతను ఏపీఎఫ్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)కి అప్పగించింది ప్రభుత్వం.
ఇప్పటివరకు బుక్ మై షో, జస్ట్ టికెట్స్, పేటీఎం లాంటి ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. జనవరి 1 నుంచి ఐఆర్ సీటీసీ తరహాలో టికెట్లను విక్రయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో తెలిపారు. ఇప్పటికే ఏపీ ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్ రూపొందుతోంది. ఈ విధానం వచ్చాక.. ఇకపై ప్రైవేట్ ప్లాట్‌ఫామ్‌లపై టికెట్ బుక్ చేసుకునే అవకాశం, థియేటర్లలో టికెట్ కొనుక్కునే సదుపాయం ఉండదని సమాచారం.
Drinks To Burn Fat : పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే ఈ పానీయాలు ట్రై చేసి చూడండి
సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని.. దీని వల్ల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసమే ప్రభుత్వమే ఆన్ లైన్ లో విక్రయించాలని నిర్ణయించినట్లు అసెంబ్లీలో చట్టసవరణ సందర్భంగా మంత్రి పేర్ని నాని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసిన ప్రభుత్వం జనవరి 1 నుంచి నూతన విధానాన్ని అమలు చేయబోతోంది.
కొత్త వెబ్ సైట్ లో విడుదలైన, విడుదల కాబోతున్న సినిమాల వివరాలను పొందుపర్చనున్నారని తెలుస్తోంది. వాటిలోనే సినిమా థియేటర్ల వివరాలు, ధరలను ఉంచుతారు. వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకునే అవకాశముందని సమాచారం. అయితే ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సౌలభ్యం లేని వారు నేరుగా థియేటర్ లోని కౌంటర్ల దగ్గర తీసుకునే అవకాశం ఉంటుందని గతంలో ప్రభుత్వం చెప్పినా.. తాజా ఉత్తర్వుల్లో అలాంటి వివరాలను ప్రస్తావించలేదు. దీన్నిబట్టి చూస్తే థియేటర్ లో టికెట్లు కొనే విధానానికి స్వస్తి పలికినట్లు అర్ధమవుతోంది. ఇకపై ఆన్ లైన్ లో టికెట్లు తీసుకున్న వారికే సినిమా థియేటర్లలో అనుమతి ఉంటుందని స్పష్టమవుతోంది.
కాగా, సినిమా టికెట్ ధరల నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కొన్ని థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిగిన సింగిల్ జడ్జితో కూడిన ధర్మాసనం.. ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసి పాత పద్ధతిలోనే టికెట్లు విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది.
Chicken : చికెన్ అతిగా తింటున్నారా…అయితే జాగ్రత్త?
అయితే థియేటర్లు ముందుగా సంబంధిత జేసీకి దరఖాస్తు చేసిన తర్వాత అనుమతిస్తే ధరలు పెంచుకోవచ్చని సూచించింది. అలాగే టికెట్ల ధరలు నిర్ణయించేందుకు కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. దీనిపై సోమవారం విచారణ జరగునుంది. కాగా, కేవలం పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని, మిగిలిన అన్ని థియేటర్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని రాష్ట్ర హోంశాఖ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.