కర్నూలులో శిశువు కిడ్నాప్ సుఖాంతం..ముక్కుపుడక పట్టించింది

  • Published By: madhu ,Published On : February 2, 2020 / 04:58 AM IST
కర్నూలులో శిశువు కిడ్నాప్ సుఖాంతం..ముక్కుపుడక పట్టించింది

Updated On : February 2, 2020 / 4:58 AM IST

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో తొమ్మిది రోజుల ఆడ శిశువు కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాప్‌ ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. నిందితురాలి ముక్కపుడకే కేసు దర్యాప్తులో కీలకమైంది. ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు వివరాలు వెల్లడించారు. గోనెగండ్ల మండలం చిన్ననేలటూరు గ్రామానికి చెందిన మరియమ్మకు కొడుకు, కూతురు సంతానం. మరియమ్మ తొమ్మిది రోజుల క్రితం సర్వజన వైద్యశాలలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

కు.ని.ఆపరేషన్ కోసం వచ్చి..
మూడురోజుల క్రితం డిశ్చార్జి అయి తిరిగి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం మరోసారి ఆసుపత్రికి వచ్చింది. మరియమ్మ చెల్లెలు పుష్పావతి, తమ్ముడు జగదీష్‌ వెంట వచ్చారు. ఉదయం ఆసుపత్రికి వచ్చిన మరియమ్మకు ఓ మహిళ పరిచయమైంది. తనది గుత్తి అని, తన తోటికోడలు డెలివరీ కోసం వచ్చానని నమ్మించింది. వీరి చేతిలో ఉన్న ఆడ శిశువును ఎత్తుకుని ఆడిస్తూ నమ్మకం కలిగేలా చేసుకుంది.

ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు..
మరియమ్మ వైద్య పరీక్షలకు వెళ్లిన తర్వాత ఆ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. బిడ్డను తీసుకుని పరారైనట్లు గ్రహించిన పుష్పవతి తన సోదరికి సమాచారం ఇచ్చింది. దీంతో మరియమ్మ బిడ్డకోసం ఆసుపత్రి అంతటా గాలించింది. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల తోపాటు నగరంలోని పలు కూడళ్ల వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. ఓ కెమెరాలో నిందితురాలి ఫోటో లభ్యం కావడంతో.. దానితో అన్ని పోలీస్‌ స్టేషన్లలో అలర్ట్ చేశారు.

ముక్కుపుడక కీలకం..
ప్యాపిలి ఎస్‌ఐ మారుతి శంకర్‌ కిడ్నాపర్‌ ముక్కుపుడకను ఎక్కడో చూసినట్లు గుర్తించాడు. తీక్షణగా పరీక్షించగా.. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ మహిళ కేసు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ ఫైల్‌ను తీసుకుని అందులో మహిళ ఫొటోను చూశారు. ఆ మహిళ ముక్కుపుడక, చిన్నారిని అపహరించిన మహిళ ముక్కుపుడకతోపాటు ఆమె చీరె, జాకెట్టు ఒకేలా ఉండటంతో వెంటనే ఫిర్యాదు చేసిన నాగప్ప ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ మహిళ మంచంపైన పడుకుని ఉంది.

పోలీసుల అదుపులో మహిళ..
ఫొటోలోని మహిళ ఆమే కావడం, ఆమె పక్కన ఆడశిశువు కనిపించడంతో గట్టిగా నిలదీశారు. ఆమె నీళ్లు నములుతుండటంతో ఆ శిశువు ఫోటోను తీసి కర్నూలు పోలీసులకు పంపించారు. దాన్ని తల్లిదండ్రులకు చూపగా వారు తమ బిడ్డగా గుర్తుపట్టారు. దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని కర్నూలుకు తీసుకువచ్చారు. నిందితురాలు ఆత్మకూరు పట్టణానికి చెందిన చంద్రకళావతిగా గుర్తించారు.

 

ఓ హాస్టల్‌లో వంట మనిషి..
రెండేళ్ల క్రితం భర్తతో కలిసి ప్యాపిలికి వచ్చి ఓ హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. ఈమెకు కొడుకు, కుమార్తె సంతానం ఉన్నారు. తాను మరోసారి గర్భవతినని ఊరంతా నమ్మించి.. దాన్ని నిజం చేసుకునేందుకే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. మూడురోజుల క్రితం చంద్రకళావతి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎస్ఐ‌ని అభినందించిన ఎస్పీ..
దీంతో ప్యాపిలి పోలీస్‌స్టేషన్‌లో మహిళ మిస్సింగ్‌ కేసు నమోదు అయింది. అయితే చంద్రకళావతి కర్నూలు సర్వజన వైద్యశాలకు వచ్చి రెండు రోజులపాటు శిశువు అపహరణ కోసం ప్రయత్నాలు చేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాలు లెక్కిస్తోంది. గంటల వ్యవధిలో కేసును ఛేదించిన ఎస్‌ఐ మారుతి శంకర్‌ను ఎస్పీ అభినందించారు. 

Read More : భయం..భయం : భారత్‌లో రెండో కరోనా కేసు