Balineni Srinivasa Reddy: బాలినేని రాజకీయ ప్రయాణంలో ఎన్నో డిఫరెంట్ షేడ్స్

వ్యాపారంలో అయినా.. రాజకీయాల్లో అయినా ఒక మూల సూత్రం ఉంది. ఏదైనా ఒక వ్యక్తి వల్ల ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది లేదా ఆ వ్యక్తి లేకపోతే ఏ మేరకు నష్టం జరుగుతుందనే అంశం ఆధారంగా.. ఆ వ్యక్తికి ప్రాధాన్యం లభిస్తుంది.

Balineni Srinivasa Reddy: బాలినేని రాజకీయ ప్రయాణంలో ఎన్నో డిఫరెంట్ షేడ్స్

Balineni Srinivasa Reddy

Updated On : January 12, 2024 / 1:32 PM IST

ముఖ్యమంత్రి కుటుంబ బంధువు… వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి నుంచీ ఆయన వెంట నడిచిన వ్యక్తి… కష్టమైనా, నష్టమైనా వెనుకాడని మనిషి… ఎంతోకొంత అనుచర గణం ఉన్న నేత… ఒకింత ఆత్మాభిమానం.. ఒకింత ఇగో… ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం… వెరసి ఆయనే… ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

అనుచరగణం ఆప్యాయంగా ‘వాసు’గా పిలుచుకునే బాలినేని తన ప్రత్యేక వ్యక్తిత్వం, వ్యవహారశైలి కారణంగా, రాజకీయ ప్రయాణంలో తరచూ ఒడిదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. మరోవైపు వైసీపీకి కూడా ఆయనను వదులుకోలేని పరిస్థితి… ఆయనకు నచ్చచెప్పి, పరిస్థితిని సర్దుబాటు చేయటానికి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ముఖ్యనేతలు చేయని ప్రయత్నం అంటూలేదు. అయినా.. ఏదో ఒక చిక్కుముడి ఎదురవుతూనే ఉంది. అంతా సర్దుకున్నట్టే అనిపిస్తుంది… అంతలోనే ఆయన అలకపాన్పు ఎక్కారని అంటున్నారు.

2019లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ఆయన క్యాబినెట్‌లో మంత్రి పదవి చేపట్టిన బాలినేని దాదాపు మూడేళ్లపాటు చక్రం తిప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన మాటే వేదం. జిల్లాకు సంబంధించి ఆయన చెప్పినట్టే పార్టీలో, ప్రభుత్వంలో అంతా నడుచుకున్నారు. ఆయన జిల్లాకు వస్తున్నారంటే… ఆయన అనుచరగణం భారీ కార్ల ర్యాలీతో కాన్వాయ్‌గా వచ్చేవారు. చివరికి… జిల్లాలో అత్యంత సీనియర్‌ రాజకీయవేత్త, భారీగా అనుచరగణం ఉన్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వంటి వారు కూడా… బాలినేని శ్రీనివాసరెడ్డిని అనుసరించే స్థాయిలో హవా నడిచింది.

ఆరోజే ఒక్కసారిగా కుదుపు 
ఎప్పుడయితే జగన్‌ తన క్యాబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించి, పూర్తిగా కొత్తవారిని చేర్చుకోవాలని దాదాపు రెండేళ్ల క్రితం నిర్ణయించారో… ఆరోజే బాలినేని ఒక్కసారిగా కుదుపునకు గురయ్యారు. తాను కూడా మంత్రి పదవి వదులుకోవాల్సి వస్తోందా అనే బాధ ఒక వైపు ఉంటే.. తనకు అంతగా పొసగని ఆదిమూలపు సురేష్‌కు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మంత్రి పదవి లభించడంతో… బాలినేని ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

కాలికింద భూమి ఒక్కసారిగా కదిలిపోయినట్లయింది. తీవ్ర భావోద్వేగానికి గురై, తాడేపల్లి సమీపంలోని తన నివాసంలో తలుపులు బిగించి కూర్చున్న బాలినేనికి సర్దిచెప్పి, ఆయన్ను అంగీకరింపజేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక రోజంతా పట్టింది.
పరిస్థితిని చక్కబెట్టి… పార్టీ పరంగా బాలినేనికి ఓ ముఖ్య బాధ్యత అప్పగించడంతో ఉన్నంతలో ఆయన సంతృప్తి చెందారు. అయితే అప్పటితో మొదలైన ఆందోళన… బాలినేనిలో ఏదో ఒక రూపంలో బయటపడుతూనే వస్తోంది. పలుమార్లు ఆయన అలక చెందారు. అసలు రాజకీయాల మీదే విరక్తి కలుగుతోందని ఒక దశలో అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు, ఎవరైనా డబ్బులు ఇస్తే పుచ్చుకున్నానని బహిరంగంగా ఓసారి వ్యాఖ్యానించారు. ఇంతలోనే.. తనకు వ్యక్తిగతంగా కాదని, పార్టీ కోసం ఎవరైనా విరాళం ఇస్తే తీసుకున్నామని సర్దిచెప్పారు. ఇదంతా.. బాలినేని ఎదుర్కొంటున్న అంతర్గత సంఘర్షణ నుంచి పుట్టుకొచ్చిన భావ వ్యక్తీకరణగానే భావించాలి.

కొత్త చికాకులు

అప్పటిదాకా జరిగిన పరిణామాలు ఒక ఎత్తయితే.. ఎన్నికలు దగ్గర పడి, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావడంతో.. దాదాపు గత రెండు నెలలుగా కొత్త చికాకులు వచ్చి పడుతున్నాయి. వదంతులో, వాస్తవాలో ఖచ్చితంగా చెప్పలేము కాని… బాలినేనిని ఒంగోలుకు బదులుగా గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమంటున్నారనే వార్తలు ఒక దశలో గుప్పుమన్నాయి.

అదేం లేదని, ఒంగోలు నుంచే బాలినేని ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని క్లారిఫికేషన్‌ వచ్చిన తర్వాత.. ఆయన కుదుటపడ్డారు. ఒంగోలు పార్లమెంటరీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు నిలబడాలన్న అంశంలో… బాలినేనికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. తనను నమ్మిన వారిని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని వ్యక్తిత్వం ఉన్న బాలినేని… ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వాలని గట్టి పట్టుతో ఉన్నారు. ఏ కారణం చేతనో కాని, మాగుంటకు మళ్లీ ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సుముఖంగా లేదు. దీంతో బాలినేనికి మళ్లీ కోపం వచ్చింది.

ఏదో సినిమాలో చెప్పినట్లు… చాలా సందర్భాల్లో మనకు వచ్చే సమస్య మన ఇంట్లోనే, మన వారితోనే ఉంటుంది. వైఫైలాగా అది మన ఇంట్లోనే.. మన చుట్టూనే తిరుగుతుంది. కనిపించని శత్రువుతో యుద్ధం చేసినట్లు ఉంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంచుమించు ఇదే పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఇక వైసీపీ పార్టీకి కూడా ఒకరకంగా ఇదే పరిస్థితి… తమ అధినేత కుటుంబంలో భాగమైన లేదా సన్నిహితమైన బాలినేని ఇప్పుడు ఒకింత ఇబ్బందిగా మారారు.

ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎంపికపై..

వైసీపీ అభ్యర్థుల మార్పుల మూడో జాబితాపై బుధవారం నాడు జగన్‌ జరిపిన సమీక్షా సమావేశంలో.. ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎంపిక మీద కూడా కీలక చర్చ జరిగింది. మాగుంటకు బదులు మరో వ్యక్తికి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు.. బాలినేనికి తెలియగానే… ఆయన మనస్తాపం చెంది, హైదరాబాద్‌కు వచ్చేశారు. ఆయనతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలనుకున్న పార్టీ నాయకత్వం, ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుతానికి పెండింగులో ఉంచింది.

పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి తనయుడైన విక్రాంత్‌రెడ్డి కూడా ఎంపీ అభ్యర్థిగా పరిశీలనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయానా బావ. అయినా ఎందుకో గాని, రాజకీయంగా వైవీ సుబ్బారెడ్డికి, బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య చాలా గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు ఇప్పటిదాకా జరిగిన పలు ప్రయత్నాలు ఫలించలేదు.

ఒంగోలు ఎంపీ టిక్కెట్‌ వైవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు కూడా కొద్ది రోజుల క్రితం చర్చ జరిగింది. అయితే, ఆయన్ను త్వరలో రాజ్యసభకు పంపించాలని పార్టీ అధినేత నిర్ణయించడంతో… ఇక ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి మార్గం సుగమం అయినట్లేనని బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. బుధవారం నాటి చర్చల్లో… మాగుంట పట్ల అంతగా సానుకూల వాతావరణం కన్పించకపోవడంతో… బాలినేని సహజంగానే మనస్తాపానికి గురయ్యారు.

ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ఉన్న మాగుంట సమస్యను పార్టీ అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుందో, బాలినేనికి ఏమేరకు సంతృప్తి కలుగుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా.. బాలినేని రాజకీయ ప్రస్తానంలో.. రానున్న రెండు వారాలు చాలా కీలకం. ఎందుకంటే ఈ రెండు వారాల్లోనే బాలినేనికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు జరిగిపోతాయి.

వ్యాపారంలో అయినా.. రాజకీయాల్లో అయినా ఒక మూల సూత్రం ఉంది. ఏదైనా ఒక వ్యక్తి వల్ల ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది లేదా ఆ వ్యక్తి లేకపోతే ఏ మేరకు నష్టం జరుగుతుందనే అంశం ఆధారంగా.. ఆ వ్యక్తికి ప్రాధాన్యం లభిస్తుంది. ఒక వ్యక్తి తమతో ఉన్నా, లేకున్నా పెద్ద తేడా ఉండదని భావించినప్పుడు… ఆ వ్యక్తికి లభించే ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఒకవేళ, ఈ అంశాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తికి సంబంధించిన నిర్ణయం జరిగిపోతే… ఎక్కడో… ఏదో లెక్క తప్పినట్లే!

Read Also

Balineni Srinivasa Reddy: మాగుంట పోటీపై క్లారిటీ ఇవ్వలేమని బాలినేనికి తేల్చిచెప్పిన వైసీపీ అధిష్ఠానం