నరసాపురం నుంచి పోటీ చేసేది నేనే.. నో చేంజ్: భూపతిరాజు శ్రీనివాసవర్మ

టీడీపీ ఆయనకు ఎక్కడో చోట అవకాశం కల్పించాలని.. చంద్రబాబు ఆయనకు ఏం హామీయిచ్చారో తనకు తెలియదన్నారు భూపతిరాజు శ్రీనివాసవర్మ.

నరసాపురం నుంచి పోటీ చేసేది నేనే.. నో చేంజ్: భూపతిరాజు శ్రీనివాసవర్మ

Updated On : April 5, 2024 / 3:43 PM IST

Bhupathiraju Srinivasa Varma: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో హీటెక్కుతున్నాయి. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీలో నిలిచారు. అయితే సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను కచ్చితంగా పోటీలో ఉంటానని రఘురామ కృష్ణంరాజు ఇప్పటికీ చెబుతున్నారు. దీనిపై నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ తాజాగా స్పందించారు.

నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేది తానేని, ఈ విషయంలో మరో మాటకు తావులేదని ఆయన 10టీవీతో చెప్పారు. పార్టీకి 30 ఏళ్లపాటు తాను చేసిన సేవలను గుర్తించి బీజేపీ పార్లమెంటరీ బోర్డు తనకు టికెట్ ఇచ్చిందని తెలిపారు. తన టికెట్ విషయంలో రఘురామ కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోబోనని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు ఆయన మంచి మిత్రుడని, టీడీపీ ఆయనకు ఎక్కడో చోట అవకాశం కల్పించాలని కోరారు. చంద్రబాబు ఆయనకు ఏం హామీయిచ్చారో తనకు తెలియదన్నారు. కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు ఆయనకు అవకాశం కల్పిస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు.

Also Read: చంద్రబాబు నాయుడు చేసిన ఘోర తప్పిదం ఇదే: విజయసాయిరెడ్డి

చంద్రబాబుతో రఘురామ కృష్ణంరాజు భేటీ
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ అధినేత చంద్రబాబును రఘురామ కృష్ణంరాజు శుక్రవారం కలిశారు. బస్సులో కొద్దిసేపు వారిద్దరూ మంతనాలు సాగించారు. మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశానని, ఏం మాట్లాడుకున్నామో మీకు ఎలా చెబుతానని మీడియాతో రఘురామ కృష్ణంరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరుతున్నారని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో కాసేపు ఆగాలి అంటూ చమత్కరించారు.

Also Read: ఎమ్మెల్యే వెలగపూడి విజయ పరంపరకు బ్రేక్ పడుతుందా? విశాఖ తూర్పులో రసవత్తర పోరు