వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి మేయర్ దంపతులు..!

వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.

వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి మేయర్ దంపతులు..!

Eluru Mayor Shaik Noorjahan Resign : ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత జగన్ కు తమ రాజీనామా లేఖ పంపారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యుడు పెదబాబు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. రేపు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో మరికొంత మంది కార్పొరేటర్లతో మేయర్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరబోతున్నారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మేయర్ దంపతులు జంప్..!
ఏలూరు నగర పాలక సంస్థలో వైసీపీకి 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇద్దరు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా, టీడీపీకి ఐదు మంది ఉన్నారు. మిగతా 45 మంది వైసీపీకి ఉన్నారు. అలాగే మేయర్ పదవి కూడా వైసీపీ ఖాతాలోనే ఉంది. అయితే, గత కొద్దిరోజులుగా వైసీపీలో రాజీనామాల పర్వం నడుస్తోంది. ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతున్నారు. తాజాగా మేయర్, నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుడు, మేయర్ భర్త పెదబాబు.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు మేయర్ దంపతులు ప్రకటించినా.. టీడీపీలో చేరేందుకే వారు ఇలా చేశారని తెలుస్తోంది.

మేయర్ దంపతుల రాకను వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులు..!
అయితే, వీరి రాకను టీడీపీలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మేయర్ నూర్జహాన్ దంపతులది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే నైజమని, ప్రజా సమస్యల పరిష్కారం కన్నా వారికి అధికారమే ముఖ్యం అని మండిపడుతున్నారు. 2014లో తొలి మేయర్ గా నూర్జహాన్ ఎన్నికయ్యారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో మళ్లీ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. మేయర్ దంపతుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

 

Also Read : వైసీపీని వెంటాడుతున్న డర్టీ పిక్చర్ ఎపిసోడ్‌.. నేతల తీరుతో తలపట్టుకుంటున్న హైకమాండ్..!