వైసీపీని వెంటాడుతున్న డర్టీ పిక్చర్ ఎపిసోడ్.. నేతల తీరుతో తలపట్టుకుంటున్న హైకమాండ్..!
గతంలో డ్రైవర్ హత్య కేసులో జైలుకెళ్లిన అనంతబాబు వల్లే దళితులు వైసీపీకి దూరమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వైరల్ అవుతున్న వీడియోతో వైసీపీకి మరింత నష్టమనే టాక్ వినిపిస్తోంది.

Gossip Garage : గోరుచుట్టపై రోకలిపోటులా తయారైంది వైసీపీ పరిస్థితి. ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హైకమాండ్‌కు తలనొప్పి తెస్తున్నారు కొందరు నేతలు. డర్టీ పిక్చర్స్‌తో పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. అధికారం పోయిన క్షణం నుంచి కేసులతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. అది చాలదన్నట్లు సొంత నేతల ఘన కార్యాలు మరింత డ్యామేజ్ చేస్తున్నాయంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలియక పార్టీ అగ్రనాయకత్వం తర్జనభర్జన పడుతోందని చెబుతున్నారు.
వైసీపీని తలెత్తుకోనీయకుండా చేస్తున్న డర్టీ పిక్చర్స్..
ఏ ముహూర్తాన అధికారం పోయిందో కానీ, సమస్యల వలయం నుంచి వైసీపీ బయట పడలేకపోతోంది. ప్రజా మద్దతుతో పోరాడి మళ్లీ సానుకూల వాతావరణం ఏర్పరుచుకోవాలని అధినేత జగన్ ఓ పక్క ప్రయత్నిస్తుంటే… ఆ పార్టీ నేతలపై వరుసగా వస్తున్న ఆరోపణలు అధినేత ముందరి కాళ్లకు బంధం వేసేస్తున్నాయంటున్నారు. విశాఖలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్… ఆ తర్వాత టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వార్.. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ పిక్చర్… వైసీపీని తలెత్తుకోనీయకుండా చేస్తున్నాయంటున్నారు.
ముందు శాంతి, తర్వాత దువ్వాడ, ఇప్పుడు అనంతబాబు..
విశాఖ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆమె భర్తే ఆరోపణలు చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డిపై ఆకస్మికంగా వచ్చిన ఆరోపణలకు పార్టీలో ఓ వర్గమే కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే విజయసాయిరెడ్డి వివరణతో ఆ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడగా, ఆ వెంటనే దువ్వాడ ఫ్యామిలీ వార్ వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. చివరికి టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడను తప్పించి… తప్పు చేస్తే యాక్షన్ ఉంటుందని హెచ్చరించింది పార్టీ. ఈ వివాదం నుంచి పార్టీ బయటపడగా, అల్లూరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ పిక్చర్ పార్టీని మళ్లీ కష్టాల్లోకి నెట్టిందంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అనంతబాబు వీడియో..!
అల్లూరి జిల్లా రంప చోడవరానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనంతబాబు తప్పులను తవ్వితీస్తోంది. ఇదే సమయంలో ఆయన అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తన వీడియోను మార్ఫింగ్ చేశారని అనంతబాబు పోలీసులకు కంప్లెంట్ చేసినా, ఆయన ప్రతిపక్షంలో ఉండటంతో అసలు వాస్తవాలు అంటూ ఏ అంశం ప్రచారంలోకి వస్తుందోనని పార్టీ అధిష్టానం టెన్షన్ పడుతోంది.
ఆ వీడియోతో వైసీపీకి మరింత నష్టమనే టాక్..
గతంలో డ్రైవర్ హత్య కేసులో జైలుకెళ్లిన అనంతబాబు వల్లే దళితులు వైసీపీకి దూరమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వైరల్ అవుతున్న వీడియోతో వైసీపీకి మరింత నష్టమనే టాక్ వినిపిస్తోంది. ఐతే ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని, డర్టీ పిక్చర్‌తో తనకు సంబంధం లేదని అనంత్‌బాబు వాదిస్తున్నా, ఆయన గత చరిత్ర వల్ల ఆ వాదనకు ఎక్కడా సానుకూలత కనిపించడం లేదంటున్నారు. దీంతో పార్టీ ఈ గండం నుంచి గట్టెక్కే విషయమై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
అనంతపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఆడియోలు, వీడియోలు పార్టీ అధికారంలో ఉండగా వైరల్ అయ్యాయి. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్‌పై విచారణ జరిపిన సీఐడీ… ఆ వీడియోను మార్ఫింగ్ చేసినట్లు తేల్చింది. అప్పట్లో పార్టీ అధికారంలో ఉండటంతో తీవ్రమైన ఆరోపణల నుంచి మాధవ్ ఈజీగా బయటపడగలిగారు. కానీ, ఇప్పుడు అదే రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు తన నిజాయితీని ఎలా నిరూపించుకోగలరనేది ఆసక్తికరంగా మారింది.
స్వయంగా చేసిన ఫిర్యాదుతో ఇరుక్కుపోయారా?
ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండటం, పైగా అధికార పక్షానికి అనంత్‌బాబు టార్గెట్ అవ్వడంతో ఏ చిన్న ఆధారం దొరికినా కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో అనంతబాబే స్వయంగా చేసిన ఫిర్యాదుతో ఇరుక్కుపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన వీడియోను మార్ఫింగ్ చేసినట్లు జులై నెలలోనే ఫిర్యాదు చేసినట్లు అనంత్‌బాబు చెబుతున్నప్పటికీ… ఇప్పటికే పార్టీకి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పోలీసు కేసు వల్ల లాభం ఎంత జరుగుతుందో కానీ, మరింత నష్టపోకుండా చూసుకోవడం ఒక్కటే అనంతబాబు ముందున్న ఆప్షన్ అంటున్నారు. పార్టీ కూడా ఇప్పుడు ఇదే అంశంపై టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు.
Also Read : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఒక్క సభ్యుడూ లేకపోయినా మున్సిపల్ పీఠం టీడీపీ కైవసం..!
డ్రైవర్ హత్య కేసులో బెయిల్‌పై బయట ఉన్న అనంతబాబు వ్యవహారంలో కూటమి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనంతబాబు చెబుతున్నట్లు ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియో మార్ఫింగ్ అయితే ఆయనతోపాటు పార్టీ సేఫ్‌గా బయటపడొచ్చునని అంటున్నారు. లేని పక్షంలో తాను మునగడమే కాకుండా పార్టీ పుట్టి ముంచిన నేతగా మరోసారి విమర్శలు ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు.