Bill Gates: బాబుగారూ.. మీరు చాలా గ్రేట్.. సీఎం చంద్రబాబుపై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం..
చంద్రబాబు చూపిన ఆసక్తి, చిత్తశుద్ధి ఆయన విజన్‌కు నిదర్శనం అని బిల్ గేట్స్ కితాబిచ్చారు.

Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసిస్తూ బిల్ గేట్స్ లేఖ రాశారు. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో జరిగిన ఒప్పందం, సమావేశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. మంచి వాతావరణంలో సంప్రదింపులు జరిపామన్న బిల్ గేట్స్.. పేదలు-అట్టడుగు వర్గాల విద్య, ఆరోగ్యంలో, .. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపై గేట్స్ ఫౌండేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని అభినందించారు.
కొన్ని నెలల క్రితం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ బృందం సమావేశమైంది. ఆరోగ్య రంగాన్ని పటిష్ట పరచడంతో పాటు హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్‌టెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడం, వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల తయారీ, సాయిల్ హెల్త్ మానిటరింగ్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి మైక్రో న్యూట్రీయంట్లు అందించే అంశాలపై చర్చించారు.
పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను బలోపేతం చేయడంతో పాటు మెరుగైన సేవలు అందించేందుకు చంద్రబాబు చూపిన ఆసక్తి, చిత్తశుద్ధి ఆయన విజన్‌కు నిదర్శనం అని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ఏఐ డ్రివెన్ డిసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్.. చంద్రబాబు నాయకత్వ ప్రతిభను మరోసారి బయటపెట్టాయని బిల్ గేట్స్ అన్నారు.
Also Read: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా.. జనసేనకు పదవి.. అలిగిన టీడీపీ సభ్యులు..!
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ తో పాటు భారత్ సహా ఇతర అల్పా ఆదాయ దేశాలకు ఉపయోగపడుతుందన్నారు గేట్స్. ఈసారి తన భారత పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే నాటికి.. మీ నాయకత్వం-మన భాగస్వామ్యంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో అద్భుతమైన పురోగతి సాధిస్తారని ఆకాంక్షించారు. గేట్స్ ఫౌండేషన్-ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం మున్ముందు కొనసాగాలని కలిసి కట్టుగా పని చేద్దామని ఆశిస్తున్నట్లుగా చెప్పారు బిల్ గేట్స్.