రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం లేదు : అమరావతి అభివృద్ధి అసాధ్యం

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కానీ లేవు అని స్పష్టం చేశారు. కాగా, రూ.లక్ష కోట్లతో అమరావతి అభివృద్ధి అనేది అసాధ్యం అని బొత్స తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నదే జగన్ ప్రభుత్వం లక్ష్యం అని బొత్స అన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారాయన. మూడు రాజధానుల అంశంపై నిపుణుల కమిటీ సలహాతో ముందుకెళ్తున్నామన్నారు. ఉగాది నాటికి ఇల్లు లేని వారందరికి ఇళ్లు ఇస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వంపై బొత్స మండిపడ్డారు. గత పాలకులకు దోచుకోవడం తప్ప మరే ఆలోచనా లేకపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచనే చెయ్యకపోవడం బాధాకరం అన్నారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సచివాలయం వైపు వెళ్లే రహదారిని ఆందోలనకారులు దిగ్భందించడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఐడీ కార్డులున్న వారిని మాత్రమే అటువైపు అనుమతిస్తున్నారు.
ఏపీకి 3 రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన, GN RAO కమిటీ నివేదికతో అమరావతి ప్రజలు భగ్గుమన్నారు. తమకు మూడు రాజధానులు వద్దని, అమరావతే రాజధానిగా ఉండాలంటూ డిమాండ్ చేస్తూ 13 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని శాంతింప చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. రాజధానిపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. హైపవర్ కమిటీని అపాయింట్ చేసింది. ఈ కమిటీ మూడు వారా్లో నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదికపై చర్చించాక… ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.