Buddha Venkanna : టీడీపీ సమావేశంలో కంటతడి పెట్టిన బుద్దా వెంకన్న.. అవమానం జరిగిందని ఆవేదన

బుద్ధా వెంకన్న స్టేజిపైకి వెళ్లకుండా కార్యకర్తలతోనే కూర్చున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి బుజ్జగించినా.. వినిపించుకోకుండా కన్నీళ్లు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయారు.

Buddha Venkanna : టీడీపీ సమావేశంలో కంటతడి పెట్టిన బుద్దా వెంకన్న.. అవమానం జరిగిందని ఆవేదన

Updated On : September 13, 2022 / 7:13 PM IST

Buddha Venkanna : ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. స్టేజిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్టీ నేత బుద్దా వెంకన్న ఫొటో లేకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బుద్ధా వెంకన్న స్టేజిపైకి వెళ్లకుండా కార్యకర్తలతోనే కూర్చున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి బుజ్జగించినా.. వినిపించుకోకుండా కన్నీళ్లు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయారు.

అలాగే ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అనుచరులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను స్టేజ్ పైకి పిలవలేదంటూ సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. నా జీవితంలో తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్నా అని బుద్దా వెంకన్న వాపోయారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. నా జీవితంలో తొలిసారి ఈరోజు కంటతడి పెట్టా. జీవితంలో ఎప్పుడూ రాజకీయాల కోసం కంటతడి పెట్టలేదు. కానీ, చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ” అని బుద్దా వెంకన్న అన్నారు.

కృష్ణా జిల్లా నేతలకు చంద్రబాబు ఇటీవలే క్లాస్ పీకారు. పనితీరు బాగోలేదని చెప్పారు. అయినా ఆ జిల్లా నేతల్లో మాత్రం మార్పు రాలేదంటున్నారు. కృష్ణా జిల్లా టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేతలకు సరైన గౌరవం దక్కలేదనే ఆరోపణలు వచ్చాయి. ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంపై బుద్దా వెంకన్న హర్ట్ అయ్యారు. స్టేజిపైకి వెళ్లకుండా కిందే కూర్చున్నారు. ఇది గమనించిన టీడీపీ నేతలు వెంటనే అలర్ట్ అయ్యారు. బుద్దా వెంకన్నను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన వినిపించుకోలేదు.

అనంతరం కన్నీళ్లు పెట్టుకుని టీడీపీ సమావేశం నుంచి వెళ్లిపోయారు బుద్దా వెంకన్న. వేదిక మీదకు రావాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుద్దా వెంకన్నను పదే పదే కోరినా.. ఆయన కిందనే కాసేపు కూర్చుని మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బతిమాలినా బుద్ధా వెంకన్న వినకుండా వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత సమావేశం నుంచి బుద్దా వెంకన్నతో పాటు నాగుల్ మీరా కూడా వెళ్లిపోయారు. ఇక ఈ సమావేశంలో గద్దె రామ్మోహన్ ను వేదికపైకి ఆహ్వానించలేదంటూ ఆయన అనుచరులు కూడా మండిపడుతున్నారు. ఈ పరిణామాలు టీడీపీ శ్రేణుల్లో కలవరం రేపాయి.