జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి.. వైసీపీ అధినేతపై కేసు: గుంటూరు ఎస్పీ
తాడేపల్లి నుంచి సత్తెనపల్లికి మూడు కార్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ జగన్ దాదాపు 50 వాహనాల్లో ర్యాలీగా రావడం జరిగింది.

Ys Jagan: సింగయ్య మృతి కేసుకు సంబంధించి గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు నిర్ధారణ అయిందన్నారు. డ్రైవర్ రమణారెడ్డి, వైఎస్ జగన్, నాగేశ్వర్ రెడ్డి (పీఏ), వైవీ సుబ్బారెడ్డి, పేర్నినాని, విడదల రజిని పేర్లను నిందితులుగా చేర్చామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. జగన్ కారు కింద సింగయ్య పడినట్లు వీడియోలో ఉందని ఎస్పీ తెలిపారు. గతంలో ప్రైవేట్ వెహికల్ అని చెప్పారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అప్పుడు నాకున్న సమాచారం మేరకు అలా చెప్పానని ఎస్పీ సతీశ్ వివరించారు.
”తాడేపల్లి నుంచి సత్తెనపల్లికి మూడు కార్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ జగన్ దాదాపు 50 వాహనాల్లో ర్యాలీగా రావడం జరిగింది. ఏటుకూరు రోడ్ లోని ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర సింగయ్య అనే వృద్ధుడు జగన్ వాహనం కింద పడ్డాడు. సీసీ కెమెరాలు, స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. డైవర్ రమణారెడ్డి, జగన్, నాగేశ్వర్ రెడ్డి (పీఏ), వైవీ సుబ్బారెడ్డి, పేర్నినాని, విడదల రజినిలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గతంలో ఉన్నటువంటి ఆధారాలు ఆధారంగా ప్రైవేటు వాహనంగా చెప్పడం జరిగింది” అని ఎస్పీ సతీశ్ అన్నారు.
వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు మరణం సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో జగన్ ని నిందితుడిగా చేర్చినట్లు గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ప్రకటించారు. ఆదివారం రాత్రి గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
”జూన్ 18న గుంటూరులోని ఏటుకూరు రోడ్డు బైపాస్ వద్ద జగన్ పల్నాడు ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. రోడ్డు పక్కన తీవ్రంగా గాయపడిన వృద్ధుడు సింగయ్యను ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను మరణించాడని వైద్యులు నిర్ధారించారు. సింగయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక కేసు నమోదు చేయబడింది.
”కేసు నమోదు చేసిన తర్వాత లోతైన దర్యాప్తు ప్రారంభించబడింది. ఇందులో సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ కెమెరా విజువల్స్, సంఘటన స్థలంలో ఉన్న ప్రేక్షకులు రికార్డ్ చేసిన వీడియోల వివరణాత్మక విశ్లేషణ కూడా ఉంది. దొరికిన వీడియోలలో ఒకదానిలో, సింగయ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కింద పడిపోయాడని, వాహనం టైరు ఆయన పైనుంచి వెళ్లిందని స్పష్టంగా కనిపిస్తుంది” అని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు.
Also Read: హిందువులను, దేవుళ్లను అవమానించే వారికి మనమేంటో చూపిద్దాం- మానాడులో పవన్ కల్యాణ్
నిందితుల జాబితాలో వాహనం డ్రైవర్ రమణారెడ్డితో పాటు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కాన్వాయ్‌లో భాగమైన వ్యక్తులు నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజిని కూడా ఉన్నారు. “జగన్ కాన్వాయ్ కోసం మేము 14 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చాము. అయితే, తాడేపల్లి నుండి కాన్వాయ్ ప్రారంభమైనప్పుడు, దాదాపు 50 వాహనాలు పర్యటనలో పాల్గొన్నాయి” అని సతీష్ కుమార్ తెలిపారు. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.
జూన్ 18న సత్తెనపల్లి నియోజకవర్గంలో విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్ వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన రోజున, అధికారులు, ఆ సమయంలో అందుబాటులో ఉన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సింగయ్య ఓ ప్రైవేట్ వాహనం కింద పడి చనిపోయాడని చెప్పామని ఎస్పీ అన్నారు. అయితే దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. దర్యాప్తు నిష్పాక్షికంగా కొనసాగుతుందని, చట్టం ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ తేల్చి చెప్పారు.