బాబు, పవన్ భేటీ.. రేషన్ రైస్ మాఫియాకు హడల్.. బియ్యం దందా వెనుక ఉన్న ఆ పెద్దల అంతు చూస్తారా?
పోర్టు పరిశీలనకు వెళ్లే కంటే ముందే రేషన్ బియ్యం దందాపై పవన్ కల్యాణ్‌కు ఓ క్లారిటీ ఉందట.

రేషన్ మాఫియా టార్గెట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..కాకినాడ పోర్ట్ విజిట్.. ప్రకంపనలు రేపుతోంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి లేఖ రాయడం..వెంటనే రైస్ స్మగ్లింగ్ ముఠాకు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు భేటీ అయి క్రైమ్ స్టోరీ మ్యాటరేంటో ఇన్ అండ్ ఔట్ డిస్కస్ చేశారట.
ఇక వేట షురూ అంటున్నారు కూటమి నేతలు. అయితే అపోజిషన్‌లో ఉన్నప్పుడే కూటమి లీడర్లు రేషన్ మాఫియా మీద ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టబోమని చెప్పి..అన్నట్లుగానే ముందుగా పవన్ విజిట్..తర్వాత బాబు యాక్షన్‌లోకి దిగబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు. రైస్ మాఫియాను ఎక్స్ పోజ్ చేయడం వెనుక కూటమి సర్కార్ పెద్ద ప్లానే చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికే పోర్టులే కారణమా..లేక అసలు రీజన్ ఏమైనా ఉందా అని ఆరా తీస్తోందట కూటమి ప్రభుత్వం. బియ్యం దందాకు చెక్ పెట్టాలంటే నగదు బదిలీనే సరైన విధానం అని భావించింది సర్కార్. కానీ నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం జనాలకు రేషన్ ఇవ్వాల్సిందేనట. సో సన్న బియ్య ఇస్తే ఈ రైస్ స్మగ్లింగ్ దందా ఆగొచ్చన్నది ఓ అంచనా. అయితే ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకుంటున్నవాళ్లలో 90శాతం మంది వాటిని తినడం లేదని అంచనా వేస్తోంది సర్కార్.
ఇదే రేషన్ మాఫియాకు ఆయుధం
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డు తీసుకుని.. కార్డు మీద వచ్చే బియ్యాన్ని మాత్రం ఎవరూ తినడం లేదట. బియ్యం తీసుకోకపోతే కార్డు రద్దు అయిపోతుందని..బయటి దళారులకు ఎంతకో కొంతకో అమ్మేస్తున్నారు. ఇదే రేషన్ మాఫియాకు ఆయుధంగా మారింది. అంతేకాదు కొన్ని లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు అనుమానిస్తోంది కూటమి సర్కార్. ఆ కార్డుల మీద కూడా రైస్ తీసుకుని ఏం చక్కా పోర్టుల ద్వారా దందా నడిపిస్తున్నారట. ఇక్కడ లోకాస్ట్‌లో బియ్యం సేకరించి..విదేశాలకు ఎక్కువ రేటుకు ఎక్స్‌పోర్ట్ చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నారట అక్రమార్కులు. దీంతో రేషన్ మాఫియాకు చెక్ పెట్టడంపై ఫోకస్ చేసింది.
కాకినాడ పోర్ట్‌ను పవన్ కల్యాణ్ విజిట్, ఆయన వ్యాఖ్యలు పొలిటికల్‌గా దుమారం లేపుతున్నాయి. రైస్ మాఫియాకు అధికారులు సహకరిస్తున్నారని..అంతా కుమ్మక్కై దందా నడిపిస్తున్నారన్నట్లుగా మాట్లాడారు పవన్. అంతేకాదు తనను పోర్టుకు రాకుండా అడ్డుకునేందుకు ఎన్నో కారణాలు చెప్పారని..అయినా కూడా వచ్చానంటూ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్‌ను అస్త్రంగా వాడుకుంటోంది ప్రధాన ప్రతిపక్షం వైసీపీ.
అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం..యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఎంతసేపు గత సర్కార్ అంటూ తమ మీద ఆరోపణలు చేయడమే తప్ప..యాక్షన్ తీసుకోవడానికి ఏం అడ్డొస్తుందో పవన్ కల్యాణ్, చంద్రబాబే సమాధానం చెప్పాలంటున్నారు వైసీపీ నేతలు.
పవన్ కల్యాణ్ పోర్ట్ విజిట్ తర్వాత రేషన్ బియ్యం దందాపై మరింత డీప్‌గా స్టడీ చేస్తోందట ఏపీ సర్కార్. అసలు పోర్టుకు రైస్ ఎలా వెళ్తున్నాయో ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిందట. ఇదే విషయంపై సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్..అధికారులతో మాట్లాడి గ్రౌండ్ లెవల్ పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
ప్లాన్ రెడీ..
బియ్యం మెట్రిక్ టన్నుల కొద్ది ఎలా జమ అవుతున్నాయి..పోర్టుకు ఎలా తరలిస్తున్నారు.. ఏంటి ఇదంతా అని ఆరా తీసి..రైస్ అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారట. గ్రామీణ స్థాయిలో రేషన్ షాపులు, రేషన్ కార్డు హోల్డర్ల నుంచి బియ్యం కొంటున్నది ఎవరు.? అక్కడి నుంచి పోర్టుకు ఎలా చేరుతుందో..అన్ని లింకులు తీస్తే.. రైస్ మాఫియాకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారట. త్వరలోనే దీని మీద స్పెషల్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే పోర్టు పరిశీలనకు వెళ్లే కంటే ముందే రేషన్ బియ్యం దందాపై పవన్ కల్యాణ్‌కు ఓ క్లారిటీ ఉందట. కాకపోతే వాస్తవాలేంటో.. ఏ రేంజ్ రైస్ దందా నడుస్తుందో ప్రజలకు అర్థం కావాలనే..ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారట పవన్. అంతే కాదు ఏపీలోని కొన్ని పోర్టులు మాజీ సీఎం జగన్ సన్నిహితుల చేతుల్లో ఉన్నాయట. రైస్ స్మగ్లింగ్ దందా వెనుక ఆ పెద్ద నేతనే ఉన్నారని అనుమానిస్తున్నారట. అందుకే పోర్టులు ఎవరి చేతిలో ఉన్నాయి?
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న కంపెనీల బినామీలు ఎవరు.? ఇలా అన్నింటి మీద దర్యాప్తు చేయాలంటే..గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో క్లారిటీ రావాలనే..పోర్టులో సీజ్ అయిన బోటును పరిశీలించారట పవన్. గత సర్కార్ హయాంలో బియ్యం మాఫియా దందా ఏ రేంజ్‌లో నడిచిందో..అందుకు ఎవరు సహకరించారో అన్ని వివరాలు బయటికి తీసి..అసలు సూత్రధారులను ఎక్స్‌పోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఊరూరా జరిగే బియ్యం దందాకు కిందిస్థాయిలోనే చెక్ పెడితే..రేషన్ రైస్ స్మగ్లింగ్ ముఠా గిలగిల కొట్టుకోవడం ఖాయమంటున్నారు కూటమి నేతలు. అయితే హంగామా, హడావుడి చేసి వదిలేస్తారా లేక బియ్యం మాఫియాకు ఏపీ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతుందో చూడాలి మరి.
అసెంబ్లీలో అప్పుల గురించి పదే పదే దుష్ప్రచారం చేశారు.. హామీలపై నోరెత్తలేదు: బొత్స