పదవులు శాశ్వతం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం- ఎంపీలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలన్నారు.

పదవులు శాశ్వతం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం- ఎంపీలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Updated On : June 6, 2024 / 7:20 PM IST

Chandrababu Naidu : ఏపీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ ద్వారా మీటింగ్ లో పాల్గొన్నారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాధ్యత పెరిగిందన్నారు చంద్రబాబు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని చంద్రబాబు సూచించారు.

రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్ లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించాలన్నారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతం అని ఎవరూ అనుకోవద్దని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు.. జగన్ కేసుల మాఫీ ఎజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించానని, వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు.

ఎంపీలతో కలిసి ఢిల్లీకి చంద్రబాబు
మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీయే భాగస్వామ పక్షాల సమావేశానికి వారితో కలిసి హాజరుకానున్నారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి రెండు పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

”ప్రజలు ఇచ్చిన తీర్పుతో మనపై మరింత బాధ్యత పెరిగింది. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలి రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. అందుకు తగ్గట్టుగానే పార్లమెంటులో కృషి చేయాలి. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి. ఆ తర్వాతే మనం. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలి. పదవులు శాశ్వతం కాదు” అని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు.

Also Read : ఏపీ ఎన్నికల్లో బాలయ్య ఫ్యామిలీ జోరు.. ధర్మాన సోదరులకు భంగపాటు

ఎన్డీఏ కూటమికే సంపూర్ణ మద్దతు
చంద్రబాబుతో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎంపీలు. ఇంత పెద్ద మెజార్టీ సాధించడానికి పరోక్షంగా వైసీపీ కూడా కారణమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత భారీ విజయం సాధించడానికి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోపాటు తెలుగు ప్రజల్లో ఉన్న కసి దీనికి కారణం అన్నారు. ఎన్నికల ముందు నుంచి మేము ఎన్డీఏ కూటమితోనే కలిసి ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమికే మా సంపూర్ణ మద్దతు అని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక అంశాల్లో వారి మద్దతు కావాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో పాటు వివిధ పార్లమెంటు నియోజకవర్గాల్లో అనేక అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు ఎంపీలు భరత్ (విశాఖ), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), కలిశెట్టి అప్పలనాయుడు (విజయనగరం).