Chandrababu: అన్నపూర్ణ రాష్ట్రంలో వరివేయొద్దనే పరిస్థితి.. రోడ్లే నాగరికతకు చిహ్నాలు!
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరివేయొద్దనే దుస్థితి జగన్ రెడ్డి కల్పించాడని దుయ్యబట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.

Chandrababu
Chandrababu: దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరివేయొద్దనే దుస్థితి జగన్ రెడ్డి కల్పించాడని దుయ్యబట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. అవినీతిని కేంద్రీకృతం చేసి అన్నీ వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. కియా లాంటి ప్రాజెక్టులు తీసుకురావటం విధ్వంసం చేసినంత సులభం కాదని అన్నారు. జాబ్ లెస్ క్యాలెండర్‌తో యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు.
ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా దాడులకు దిగే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. జ్ఞానాన్ని సైతం బలిపశువుని చేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారని అన్నారు.
రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై వీడియో ప్రదర్శించిన చంద్రబాబు.. సామాన్యులు సైతం రహదారుల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నాగరికతకు చిహ్నం రహదారులు అని, రోడ్లు బాగుంటేనే ఇంధనం ఆదా అవుతుందని, కానీ, ఇప్పుడు రోడ్లపైనే ప్రసవాలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
బిల్లులు చెల్లించని కారణంగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావట్లేదని అన్నారు. నిర్మించిన ఇళ్లు పేదలకు ఇచ్చేందుకు కూడా జగన్ రెడ్డికి మనస్సు రావట్లేదని, జగన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకంటే ఎన్నో రత్నాలు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. చెత్త, వీధి దీపాలపైనా పన్నులు వేయొచ్చని వినూత్నంగా ఆలోచించిన ఏకైక ప్రభుత్వం జగన్ రెడ్డిదేనని అన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసి ఓటీఎస్ పేరుతో దోపిడీ చేస్తున్నారని అన్నారు.