కక్ష సాధింపులకు ఇది సమయం కాదు- ఆ ముగ్గురిదీ ఒకటే మాట
ఎన్నికల్లో దిగ్విజయం సాధించిన తర్వాత వేర్వేరు సందర్భాల్లో మీడియాతోనూ, కార్యకర్తలతోనూ మాట్లాడిన ముగ్గురు నేతలు ఒకేలా స్పందించారు.

Chandrababu Naidu : కక్ష సాధింపులకు ఇది సమయం కాదని, రాష్ట్ర పునర్ నిర్మాణమే ప్రధానం అంటున్నారు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్. ఎన్నికల్లో దిగ్విజయం సాధించిన తర్వాత వేర్వేరు సందర్భాల్లో మీడియాతోనూ, కార్యకర్తలతోనూ మాట్లాడిన ముగ్గురు నేతలు ఒకేలా స్పందించారు. ప్రతిపక్షంపై కక్ష సాధించడం తమ లక్ష్యం కాదని తేల్చి చెప్పారు.
”వైసీపీ కానీ, జగన్ కానీ.. వ్యక్తిగతంగా నాకు శత్రువులు కారు. జనసేన నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది కక్ష సాధింపులకు సమయం కాదు. 5కోట్ల మంది ప్రజల కోసం పని చేసే సమయం ఇది” అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
”కక్ష సాధింపులు, వేధింపులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం.. మాకు రాదు. మేము చేయం. ఇదంతా ఆ పార్టీకి తెలిసింది. అందుకే ప్రజలు ఇవాళ ఇలాంటి తీర్పు ఇచ్చారు. మాపై బాధ్యత మరింత పెరిగింది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన అవసరం మా మూడు పార్టీలపైన ఉంది. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎవరికీ రాని విజయం, మెజార్టీ మాకు వచ్చింది. మా బాధ్యత మేము నెరవేర్చాలి. హుందాగా, ప్రజలకు సేవ చేసే విధంగా పని చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే బాధ్యత మాపై ఉంది” అని నారా లోకేవ్ స్పష్టం చేశారు.
”చాలామంది ఓడిపోయారు. ఓడిపోవడం కాదు.. అసలు నువ్వే వద్దే వద్దు అని ఓటు వేయడం డిఫరెంట్. అదే జరిగింది ఇవాళ. కక్ష సాధింపులకు పాల్పడేది లేదు. వ్యవస్థలను కాపాడటమే లక్ష్యం. ప్రజా శ్రేయస్సు కోసమే అధికారం. కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చిన మాటను, ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. జగన్ ను ఓడించడం కాదు, జగన్ ను వద్దే వద్దు అని ప్రజలు భావించారు. అందుకు ఈ ఫలితాలు నిదర్శనం” అని చంద్రబాబు అన్నారు.
Also Read : జగన్ ఘోర ఓటమికి, చంద్రబాబు ఘన విజయానికి ప్రధాన కారణాలివే- మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు